టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇమేజ్‌.. ఇప్ప‌టికీ.. నూటికి నూరు శాతం ఓకే! అభివృద్ధికి చిరునామాగా ఆయ‌న పేరు ఎప్ప‌టికీ.. ఈ తెలుగు గ‌డ్డ‌పై శాశ్వ‌త‌మే. అయితే.. అక్క‌డితో అయిపోయిన‌ట్టేనా. పార్టీ మ‌ళ్లీఅధికారంలోకి రావాలి క‌దా! అయితే.. కొన్ని మార్పులు చేర్పులు త‌ప్ప‌వ‌ని అంటున్నారు టీడీపీ సానుభూతిప‌రులు. అవేంటంటే.. పార్టీలో అధినేత మాట‌కు గౌర‌వం ఉండాలి. ఆయ‌న చెప్పింది వేదంగా పాటించే నేత‌లు ఉండాలి. కానీ, టీడీపీలో ఈ చివ‌ర నుంచి ఆ చివ‌రి వ‌ర‌కు నేత‌లు ఉన్నా.. ఆధిప‌త్య రాజ‌కీయాల‌కు నెల‌వులుగా మారిపోయారు. ఇలాంటి వారిని చంద్ర‌బాబు త‌క్ష‌ణ‌మే ఏరేయాలి.

అతి విశ్వాసం.. కూడా చంద్ర‌బాబుకు ఇబ్బందిక‌రంగా మారింది. గ‌త ఎన్నిక‌ల విష‌యాన్నే తీసుకుంటే.. ఎన్నిక‌ల్లో క్షేత్ర స్థాయి నేత‌లు వ‌ద్ద‌న్న వారికి కూడా టికెట్ ఇచ్చారు.. ఇది చాప‌కింద నీరు వంటి వ్య‌తిరేక‌త‌కు దారితీసింది.  క్షేత్ర‌స్థాయిలో త‌మ్ముళ్లు సాగించిన అవినీతి బాగోతం.. వంటివి తెలిసి కూడా బాబు క‌ట్ట‌డి చేయ‌లేక పోవ‌డం వంటివి పార్టీకి ఇబ్బందిగా మారాయి. సో.. ఇలాంటి ప‌రిస్థితిని త‌క్ష‌ణ‌మే గుర్తించి.. చెక్ పెట్టాలి. అదేస‌మ‌యంలో  అధికార ప‌క్షం వైసీపీ వేసిన ప్ర‌తివ్యూహాల్లో చిక్కుకోవ‌డం వంటివి పార్టీని ప్ర‌జ‌ల్లో ప‌లుచ‌న చేస్తున్నాయి. ఇలాంటి వాటి నుంచి చంద్ర‌బాబు చాలా అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాలి.

`జీరో` స్థాయి నుంచి పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. యువ‌త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డంతోపాటు.. వృద్ధ నేత‌ల ‌ను కేవ‌లం స‌ల‌హాల వ‌ర‌కే ప‌రిమితం చేయాలి.  ప్ర‌జ‌ల్లో పార్టీపై భ‌రోసా క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. పార్టీలో ఏం జ‌రుగుతోంది?  ఎక్క‌డ ఏనేత ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు? అని తెలుసుకుని .. ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అదే స‌మ‌యంలో వ్య‌క్తి పూజ‌ల‌కు ప్రాధాన్యం త‌గ్గించ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల్లో మ‌రింత పార్టీ పుంజుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంది. యువ‌త‌తోపాటు.. మ‌హిళ‌ల‌కు స‌మాన అవ‌కాశం క‌ల్పించ‌డాన్ని చేత‌ల ద్వారా చూపించాలి. అప్పుడే చంద్ర‌బాబుకు మ‌రింత తిరుగు ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: