వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రి పోరుకు సిద్ధం అయ్యేలా లేదు. పొత్తుల‌తోనే జ‌నం ముందుకు పోయి ఓట్లు అడ‌గాలని యోచిస్తోం ది. అదేవిధంగా పార్టీలో అనేక విష‌యాలు చ‌ర్చించిన మీద‌టే, పొత్తుపై ఓ క్లారిఫికేష‌న్ ఇవ్వాల‌ని కూడా ఆలోచిస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఒంటరిగా వెళ్ల‌డం వ‌ల్ల తాము పూర్తిగా న‌ష్ట‌పోయామ‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ప‌వ‌న్ సాయం చేసి ఉంటే ఇంత‌టి ఘోర ప‌రాజ‌యం ద‌క్కేదే కాద‌ని కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ త‌ర‌ణంలో ప‌వ‌న్ - చంద్ర‌బాబు ద్వ‌యం మ‌ళ్లీ  ప‌నిచేస్తార‌న్న ఊహాగానాలు స్ప‌ష్టంగానే విన‌ప‌డుతున్నాయి. కాపు సామాజిక వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నేత‌గా ప‌వ‌న్ త‌నని తాను ఫోక‌స్ చేసుకునేందుకు ఇటీవ‌ల ఎక్కువ‌గా దృష్టిసారిస్తున్నారు.

తొలి రోజుల్లో కుల రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ, ఈ సారి మాత్రం అందుకు భిన్నంగా సొంత సామాజిక‌వ‌ర్గ నేత‌ల బ‌లోపేతానికి ప‌వ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారనే తెలుస్తోంది. అవ‌స‌రాల రీత్యా రాజ‌కీయం అన్న సూత్రానికి అనుగుణంగా తాను ప‌నిచేస్తాన‌ని ఇప్ప‌టికే ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. ఇదే క్ర‌మంలో ప‌వ‌న్ బీజేపీతో కాకుండా టీడీపీతోనే క‌లిసి ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించార‌ని స‌మాచారం. టీడీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరితే లాభ ప‌డేది చంద్రబాబే!


వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపుల ప్రాబల్యం ఉన్న చోటు టీడీపీ కాకుండా జ‌న‌సేన త‌న అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్టాల‌ని ప‌ట్టుబ‌డితే న‌ష్టం చంద్ర‌బాబుకే! అలాకాకుండా పొత్తుల ధ‌ర్మంలో భాగంగా కొన్ని సీట్లు అడిగి మిగ‌తా చోట్ల నామ‌మాత్రం పోటీకే జ‌న‌సేన ప‌రిమితం అయితే టీడీపీ శ్రేణులు ఇక పండుగ చేసుకోవ‌చ్చు. పది ఎమ్మెల్యే స్థానాలు, రెండు, మూడు ఎంపీ స్థానాలు ప‌వ‌న్ అడిగి, వాటిని నెగ్గించుకుని వ‌స్తే చాలు అన్న భావ‌న కూడా ఒక‌టి  రాజ‌కీయ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది. ఇదే స‌మ‌యంలో ప‌వ‌న్ ఓటు బ్యాంకు పూర్తిగా టీడీపీ ప‌రం అయితే జ‌గ‌న్ కు భారీ న‌ష్టం ఖాయం. అందుకే ఇప్ప‌టి నుంచే వైసీపీ శ్రేణులు జ‌న‌సేన‌ను తిట్ట‌డం మొదలుపెడుతున్నారు.

ప‌వ‌న్, టీడీపీ మాదిరిగానే వైసీపీ,బీజేపీ క‌లిసిపోయి ప్ర‌యాణిస్తే న‌ష్ట‌పోయేది వైసీపీనే. ఎందుకంటే రాష్ట్రానికి బీజేపీ చేసిందేం లేద‌న్న వాద‌న ఒక‌టి బ‌య‌ట వినిపిస్తుంది. బాహాటంగానే కొంద‌రు బీజేపీ నాయ‌కుల‌ను నిల‌దీస్తున్నారు కూడా! కనుక గ‌త ఎన్నిక‌ల మాదిరిగా జ‌గ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే కాస్తయినా బీజేపీపై ఉన్న వ్య‌తిరేక‌త త‌న‌పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డినవారవుతారు. అదేవిధంగా చంద్ర‌బాబు, ప‌వ‌న్ ద్వ‌యంలో కొన్ని సీట్లు అయినా జ‌న‌సేన గెలుచుకునేందుకు  టీడీపీ స‌హ‌కారం ఇవ్వాలి. లేకుంటే టీడీపీ కూడా న‌ష్ట‌పోయేందుకు అవ‌కాశాలే ఎక్కువ. పొత్తులున్న స్థానాల‌లో జ‌న‌సేన ఓడిపోయినా వ‌చ్చిన న‌ష్టం ఏమీ ఉండ‌దు కానీ టీడీపీ ఓడిపోతే మాత్రం ప‌రువు పోవ‌డం ఖాయం.


మరింత సమాచారం తెలుసుకోండి: