ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్తబ్ధుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో ఒక్కసారిగా సునామీ వచ్చినట్లుగా ఉంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. మంగళవారం సాయంత్రం సరిగ్గా 5 గంటల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంపై దాడి చేశారు. సరిగ్గా ఇదే సమయంలో  రాష్ట్రంలోని పలు చోట్ల కూడా పార్టీ నేతల ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఏక కాలంలో దాడి జరిగాయి. రాజకీయ విమర్శలు చేస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక అందుబాటులోనే ఉన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం మొత్తం పరిశీలించారు. గాయపడిన వారిని పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఇక పార్టీ జాతీయ ప్రధానా కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ కూడా తన పర్యటనను వాయిదా వేసుకుని మంగళగిరి చేరుకున్నారు.

 రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నేతల్లో కొంత నైరాశ్యం నెలకొన్న మాట వాస్తవం. ఒక దశలో రాష్ట్రంలో ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలు కనీసం కనిపించలేదు. కొంతమంది ప్రభుత్వ వేధింపులకు భయపడగా... మరికొంత మంది కేసులకు భయపడి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇది కార్యకర్తలపై కూడా పెను ప్రభావం చూపింది. చాలా మంది కార్యకర్తలు కూడా.. నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ పార్టీ కార్యాలయంపై దాడి మాత్రం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం తీసుకువచ్చింది. వైసీపీ నేతల దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.... రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ నేతల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. అధికార పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయంపై దాడి.... ఒకరకంగా నేతల్లో ఉత్సాహానికి కారణమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: