1982 మార్చి 29న ఆవిర్భవించిన టీడీపీ.. 9 నెలల కాలంలోనే 1983 ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లో అధికారాన్ని చేపట్టింది. అపజయమంటూ ఎరుగని స్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ హయాంలో ఎందరో ఉద్ధండులున్నారు, మరెందరో కొత్త నాయకులున్నారు. పాత కొత్తల కలబోతగా ఉంది టీడీపీ. అయితే అధికారంలోకి వచ్చిన ఏడాదికే టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. 1984 ఆగస్టు లో జరిగిన రాజకీయ పరిణామాలతో ఎన్టీఆర్ సీఎం పదవినుంచి దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్ హయాంలో నాలుగు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మూడు సార్లు టీడీపీయే గెలిచింది. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత చంద్రబాబు హయాంలో తొలి ప్రభుత్వం ఏర్పడింది. రెండోసారి ప్రతిపక్షానికి పరిమితం కావాల్సి వచ్చింది. అయితే గతంలో టీడీపీ ఎప్పుడూ ఎరుగని దారుణ పరాజయం చంద్రబాబు హయాంలో ఎదురు కావడం విశేషం.
పార్టీలో మార్పులుంటాయా..?
ప్రస్తుతం పార్టీపై పెత్తనం చంద్రబాబు నుంచి ఆయన తనయుడు నారా లోకేష్ కి రావాల్సిన సందర్భం. ఇప్పటికే చంద్రబాబుపై వయోభారం పడినా.. 2024 ఎన్నికలను కూడా తన నాయకత్వంలోనే ఎదుర్కోవాలనుకుంటున్నారు. ఇప్పటినుంచే పార్టీని సిద్ధం చేస్తున్నారు. బహుశా 2019 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే లోకేష్ ని ముఖ్యమంత్రిగా చేసేవారేమో. ఇప్పుడది 2024కి పోస్ట్ పోన్ అయింది. అయితే వైసీపీని ఓడించడం అంత ఈజీనా అంటే చెప్పలేం. వైసీపీ ధాటిని ఎదుర్కోవాలంటే టీడీపీ సత్తా సరిపోతుందా. సంస్థాగతంగా మార్పులు చేర్పులు జరగాల్సి ఉందా. యువ నాయకత్వానికి బాధ్యతలు అప్పగించాల్సిందేనా, నందమూరి కుటుంబాన్ని కూడా పార్టీలో ఇన్వాల్స్ చేయాల్సిందేనా..? ఇలా రకరకాల ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద పార్టీ 40 ఏళ్ల పండగ జరుపుకుంటున్న శుభ సందర్భంగా.. టీడీపీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి