విడదల రజని.. ఇటీవల ఏపీ మంత్రి వర్గంలో చోటు సంపాదించారు. ఆమె ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటిసారే ఎమ్మెల్యే అయిన విడదల రజని తొలిసారే మంత్రి పదవి అందుకున్నారు.. మొదటి విడతలో అవకాశం దక్కకపోయినా రెండో విడతలో ఛాన్స్ కొట్టేశారు. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని.. వాస్తవానికి తెలంగాణ బిడ్డ కావడం విశేషం.


అవును.. ఇది నిజమే.. ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని మన తెలంగాణ బిడ్డేనట. ఆమె స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామం. ఆ గ్రామంలోని రాగుల సత్తయ్య రెండో కూతురు రజని. విడదల రజని తండ్రి సత్తయ్య బతుకు దెరువు నిమిత్తం ఎప్పుడో 40 ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వలస వెళ్లారు. హైదరాబాద్‌లోని సఫిల్‌గూడలో సత్తయ్య నివాసం ఉంటున్నారు. సత్తయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఆ ఇద్దరు కూతుళ్లలో విడదల రజని ఒకరు. సత్తయ్య రెండో కూతురైన విడదల రజనికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామికవేత్తతో పెళ్లయింది.


విడదల రజనిది రజక సామాజిక వర్గం కాగా... ఆమె భర్తది కాపు సామాజిక వర్గం. ఐటీ రంగంలో కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేసిన రజని.. వివాహం తర్వాత ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.  విడదల రజని.. మొదట్లో తెలుగు దేశం పార్టీలో చేరారు. తాను చంద్రబాబు ఐటీ తోటలో పుట్టిన పువ్వును అంటూ ఆకట్టుకునే ప్రసంగించారు. వాక్చాతుర్యానికి తోడు చక్కని రూపం, హుందా తనం కూడా ఉండటంతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు.


టీడీపీలో ఉంటే ఎదగలేనని భావించిన ఆమె తర్వాత వైసీపీలో చేరారు. పల్నాడు జిల్లా  చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పడు ఏకంగా ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అంటే ఒకప్పటి తెలంగాణ బిడ్డ విడదల రజని.. ఇప్పుడు ఏపీ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్యవిద్య మంత్రిగా ఎదిగారన్నమాట. బావుంది కదా.. విడదల రజిని విజయ ప్రస్థానం.

మరింత సమాచారం తెలుసుకోండి: