ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి మంగళవారం మధ్యాహ్నం ఒక మినీ కంటైనర్ వాహనం వచ్చింది. అది ఎవరిది? ఎందుకొచ్చింది? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇది చర్చకు దారి తీసింది. ఇందులో ఏమి ఉన్నాయి. పోలీస్ చెక్ పోస్టు వద్ద నమోదు కాకుండా వాహనం లోపలకి ఎందుకు వెళ్లింది. అదే దారిలో తిరిగి వెనక్కి ఎలా వెళ్లింది. ఇదే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నచర్చ.


శివుడి ఆదేశం లేనేదే చీమైనా కుట్టుదే అనే విధంగా పోలీసులకు తెలియకుండా వాహనం లోపలకి వెళ్లి బయటకు రావడం జరుగుతుందా. అసలు ఇది సాధ్యం అవుతుందా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం అయింది. తాజాగా దీనిపై నారా లోకేశ్ సైతం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కంటైనర్ లో ఎన్నికల కోసం నగదు తరలిస్తున్నారని.. అందుకే దానిని పోలీసులు తనిఖీ చేయలేదని అన్నారు. ఎవరికీ తెలియకుండా సీఎం క్యాంపు కార్యాలయంలోకి తరలించారని ఆరోపించారు.


అయితే దీనిపై వైసీపీ నాయకులు స్పష్టత ఇచ్చారు. ఇది కంటైనర్ కాదని.. పాంట్రీ కారు అని చెప్పారు. సీఎం జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో ఆహారాన్ని తయారు చేసుకునేందుకు ఈ పాంట్రీ వ్యాన్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను సైతం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


అయితే ఇందులో పాంట్రీ కి సంబంధించి వస్తువులు ఉన్నాయనే విషయం టీడీపీ నేతలకు తెలుసు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నసమయంలోను నంద్యాల ఉప ఎన్నిక సమయంలో వైసీపీ ఇలాంటి ఆరోపణలే చేసింది.  ఉప ఎన్నికకు సంబంధించి నగదును తరలిస్తున్నారు అని విమర్శించారు. దీనికి బదులుగా అప్పుడు దానిని వైసీపీ నాయకుల ముందు ఓపెన్ చేసి చూపించారు. ఇప్పుడు కూడా అలాంటిదే జరిగినా.. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ యత్నిస్తోందని పేర్కొంటున్నారు.  ఒకవేల నగదునే తరలించారు అనుకున్నా చేసే పని గుట్టు చప్పుడు కాకుండా చేస్తారు కానీ ఇంత పబ్లిక్ గా చేస్తారా అనేది వారి ప్రశ్న.

మరింత సమాచారం తెలుసుకోండి: