నందమూరి తారకరామారావు.. తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన మహానటుడు, మహానేత. సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలోనూ ఆయ‌న ప్రజలకు మార్గదర్శకుడయ్యారు. ఆ వారసత్వాన్ని కొనసాగించేలా నేటి తరం మీద కూడా ప్రజల్లో ఎన్నో ఆశలు ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్ప‌టికే తెరపై తన ప్రతిభతో అభిమానులను అలరిస్తూ, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు ఎన్టీఆర్‌. ఇక ఆయ‌న‌ రాజకీయ భవిష్యత్తు గురించి చర్చలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి.


పార్టీలో కొత్త శక్తిగా ఎన్టీఆర్:


అయితే ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ విషయంలో నంద‌మూరి, నారా కుటుంబాల నుంచి పూర్తి స్థాయి సానుకూలత కనిపించడం లేదు అన్న‌ది ఓపెన్ సీక్రెట్‌. ఎన్టీఆర్ రాకతో పార్టీ లోపల కొత్త శక్తి పెరుగుతుంది. అదే సమయంలో ప్రస్తుత వారసత్వానికి సవాలు అవుతుంది. అభిమానుల్లో ఉన్న మాస్ క్రేజ్‌తో రాజకీయంగా ఎన్టీఆర్ ఒక ప్రభావం చూపగలడని అందరికీ తెలుసు. కానీ, ఆ ప్రభావం ఎవరికి లాభిస్తుందో, ఎవరిని బలహీనపరుస్తుందో అన్న భయమే పెద్దది.


అభిమానుల‌కు మాత్రం తమ తారకరామారావు వారసుడుగా జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రజల కోసం పనిచేయాలని బ‌లంగా ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ రక్తంలో నందమూరి వారసత్వం ఉంది, మాటల్లో తాత‌గారి శక్తి ఉంది, కానీ కుటుంబ అంగీకారం మాత్రం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆయ‌న సోద‌రి నంద‌మూరి సుహాసిని నోరు జారారు. నిజానికి తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తాని ఇంత‌వ‌ర‌కు ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్ప‌డ‌లేదు. ఇంకా చెప్పాలంటే తాను సినిమాల‌కే ప‌రిమితం అన్న‌ట్లుగా సంకేతాలు ఇచ్చారు.


ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీ - సుహాసిని హింట్‌:


కానీ తాజాగా హ‌రికృష్ణ వ‌ర్ధంతి సంద‌ర్భంగా తండ్రికి నివాళులు అర్పించిన సుహాసిని.. అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఎన్టీఆర్ రాజ‌కీయ రంగ‌ప్రవేశం గురించి ప్ర‌శ్నించ‌గా.. సుహాసిని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `ప్ర‌స్తుతం ఎన్టీఆర్ సినిమా ఫిల్డ్‌లో బిజీగా ఉన్నారు. అవ‌కాశం క‌లిగిన‌ప్పుడు త‌ప్ప‌కుండా ఆయన పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తారు` అంటూ సుహాసిని కామెంట్స్ చేశారు. మొత్తానికి కుటుంబాల అభిప్రాయాలు ఎలా ఉన్నా ప్రజల విశ్వాసం, అభిమానుల ఆశలు, కాలం తీసుకువచ్చే మార్పులు ఎప్పుడైనా ఎన్టీఆర్ ను రాజకీయ రంగంలోకి నడిపించవచ్చు అని సుహాసిని ప‌రోక్షంగా చెప్ప‌క‌నే చెప్పేశారు. సుహాసిని తాజా కామెంట్స్ నంద‌మూరి ఇంట అంత‌ర్గ‌త ర‌చ్చ‌కు తెర లేపిన‌ట్లైంది. మ‌రోవైపు తార‌క్ ఫ్యాన్స్ మాత్రం సుహాసిని వ్యాఖ్య‌ల‌పై తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: