
ఈ ఘనతను సాధించేందుకు నారా దేవాన్డ్ గతేడాది చెక్ మేట్ మారథాన్ లో లాస్లో పోల్గార్ ప్రసిద్ధ చెస్ సంకలనం ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకం నుంచి తీసుకున్న 175 సంక్లిష్టమైన చెక్ మేట్ పజిల్స్ ను వేగవంతంగా పరిష్కరించాడు. ఈ పజిల్స్ ఒకటి తర్వాత ఒకటి కష్టంగా మారుతూ వేగం, కచ్చితత్వం, ఆలోచనా నైపుణ్యాలను పరీక్షిస్తుంది. దేవాన్ష్ వీటన్నిటినీ అత్యంత తక్కువ సమయంలో పరిష్కరించడం ద్వారా రికార్డు సృష్టించారు. ప్రపంచ చెస్ రంగంలో అత్యుత్తమ యువ ప్రతిభావంతుల్లో ఒకరుగా దేవాన్ష్ కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం లభించింది. ఈ విజయానికి దేవాన్ష్ అకుంఠిత శ్రమతో పాటు, తల్లి నారా బ్రాహ్మణి, తండ్రి నారా లోకేష్, కోచ్ కే. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహం అందించారు.
ఈ విజయం గురించి మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ "ఈ రోజు వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో దేవాన్ష్ ఈ గౌరవాన్ని అందుకోవడం ప్రత్యేకమైంది. అతని ముందుచూపు, ఆలోచనాశక్తి, ఒత్తిడిలో ప్రదర్శించిన సమయస్పూర్తి, చిన్న వయస్సులోనే పూర్తిగా ఆటకు అంకితం కావడం వంటి విభిన్న శైలి వల్ల ఈ విజయం సాధ్యమైంది. తండ్రిగా దేవాన్ష్ అవిశ్రాంత శ్రమని నేను దగ్గరగా చూశాను. ఈ గుర్తింపు అతని కృషికి నిజమైన బహుమతి. మేమంతా అతను సాధించిన ఈ ఘనతకు ఎంతో గర్వపడుతున్నాం" అని అన్నారు.
దీంతోపాటు దేవాన్ష్ మరో రెండు ప్రపంచ రికార్డులను కూడా గతంలో సొంతం చేసుకున్నాడు. 7-డిస్క్ టవర్ ఆఫ్ హనోయ్‌ను కేవలం 1 నిమిషం 43 సెకన్లలో పూర్తి చేయడం, 9 చెస్ బోర్డ్స్ పై 32 పావులను సరైన పద్ధతి ద్వారా 5 నిమిషాల్లో అమర్చడంలో ప్రపంచ రికార్డులు సాధించాడు. ఈ రోజు లండన్‌లో జరిగిన అవార్డ్స్ కార్యక్రమంలో ఆయనకు లభించిన గుర్తింపు ఆయన కుటుంబానికి, అలాగే ప్రపంచ చెస్ రంగంలో భారత్ తరపున పెరుగుతున్న ఖ్యాతికి గర్వకారణంగా నిలిచింది.