ఇంటర్నెట్ డెస్క్: సిడ్నీ టెస్టులో టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ ఎంత గొప్పగా ఆడారో వేరే చెప్పక్కర్లేదు. టీమిండియాను ఓటమినుంచి బయటపడేయడమే కాకుండా.. ఓ అద్భుతమైన పార్ట్‌నర్‌షిప్ నెలకొల్పి ఆసీస్‌ బౌలర్లకు టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటో చూపించారు. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా హెడ్‌కోచ్ రవిశాస్త్రి.. బౌలర్ శార్దూల్ ఠాకూర్ ద్వారా క్రీజులో ఉన్న అశ్విన్, విహారిలకు ఓ మెసేజ్ చేరవేశాడు. కానీ శార్దూల్.. కోచ్ చెప్పిన మెసేజ్‌ను వారికి చేరవేయలేదు. ఈ విషయం తాజాగా బయటకొచ్చింది.

ప్రతి స్పోర్ట్‌లోనూ డ్రింక్స్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు.. కోచ్‌లు ప్రత్యేక సందేశాలు పంపడం సాధారణ విషయమే. బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో కూడా భారత జట్టు హెడ్ కోచ్ ఇలాంటి ఓ మెసేజ్‌నే పంపించారు. ఆ మెసేజ్ శార్దూల్ ద్వారా పంపించారు. విహారి ధాటిగా ఆడాలని, మరో ఎండ్‌లో అశ్విన్‌ వికెట్‌ కాపాడుకోవాలనేదే ఆ మెసేజ్ సారాంశం. కానీ ఈ మెసేజ్‌ను శార్దూల్ తమకు చేరవేయలేదట.

ఈ విషయాన్ని ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ వెల్లడించారు. అశ్విన్‌తో తాను మాట్లాడానని, శార్దూల్ అలాంటి మెసేజ్ ఏదీ తమకు తెలియజేయలేదని చెప్పినట్లు శ్రీధర్ తెలిపారు. శార్దూల్‌ తమ వద్దకొచ్చి.. ‘డ్రెస్సింగ్‌ రూమ్‌లో చాలా విషయాలు చెప్పమని చెప్పారు. కానీ నేను అవేమీ మీకు చెప్పను. అవన్నీ పక్కనపెట్టండి. మీరు బాగా ఆడుతున్నారు. ఇలాగే కొనసాగండి’ అని చెప్పినట్లు అశ్విన్ చెప్పినట్లు శ్రీధర్ వెల్లడించారు.

కాగా.. సిడ్నీలో జరిగిన ఆ టెస్టులో  రెండో ఇన్నింగ్స్‌లో చివరి రోజున టీమిండియా ఓటమి అంచున నిలిచింది. ఈ క్రమంలోనే హనుమ విహారి(23), రవిచంద్రన్‌ అశ్విన్‌(39) నాటౌట్‌గా నిలిచి జట్టును ఓటమి నుంచి బయటపడేశారు. 259 బంతులు ఎదుర్కొని చివరివరకు క్రీజులో నిలిచి మ్యాచ్‌ను ఆసీస్‌కు దూరం చేసింది. ఈ మ్యాచ్‌లో వారిద్దరి ఆటపై సీనియర్ ఆటగాళ్లు సైతం ప్రశంసల వర్షం కురిపించారు.

ఆ మ్యాచ్ తరువాత గాబా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో కూడా ఇలాంటి పోరాటాన్నే టీమిండియా చూపించింది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ అంతా అవుటైన సందర్భంలో అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్(62), శార్దూల్ ఠాకూర్(67)లు క్రీజులో నిలుచుని అద్భుత పోరాటాన్ని నెలకొల్పారు. దీంతో ఆసీస్‌కు కేవలం 33 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. ఇక రెండో టెస్టులో శుభ్‌మన్ గిల్(91), పుజారా(51), రిషబ్ పంత్(89 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టీమిండియాకు కట్టబెట్టారు. దీంతో భారత్ ఆసీస్‌పై చారిత్రాత్మక విజయం సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: