ఇంటర్నెట్ డెస్క్: తయారు చేసిన బుల్లెట్ ప్రూప్ కార్లు పగిలిపోయాయి. ప్రయోగించిన రాకెట్‌లు గాల్లోనే పేలిపోయాయి. బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పులు ఆస్తులను ఎప్పుడో మింగేశాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న టెస్లా దివాళా అంచున నిలబడింది. చిట్టచివరి సొంత భవనం కూడా అమ్మేసి చిట్టచివరి ప్రయోగం చేశాడు. తనకు తెలుసు.. ఈ ప్రయోగం విఫలమైతే అతడి జీవితం ఫ్లాట్ ఫాంపై కి వచ్చేస్తుందని. కానీ అతడి పట్టుదల, నమ్మినదాని కోసం ఎంత దూరమైనా వెళ్లే తత్వం అతడికి ఎక్కడ లేని ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. పట్టుదల, ఆత్మవిశ్వాసాలే పెట్టుబడిగా చిట్టచివరి ప్రయోగాన్ని చేపట్టాడు. అది సక్సెస్ అయింది. అంతే మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. అతడే అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్.


 ప్రస్తుతం అమెరికాలో ఎలాన్ మస్క్ ఓ రోల్ మోడల్. ఒక్క అమెరికాకే కాదు. ప్రపంచ వ్యాప్తంగా అతడో హీరో ఇప్పుడు. రియల్ ఐరన్ మ్యాన్ అని కూడా ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఒక్క ప్రయోగం సక్సెస్‌తో బిలియనీర్‌గా మారిన మస్క్ కంపెనీ టెస్లా షేర్లు కూడా ఆకాశాన్నంటాయి. ఇప్పటికీ పెరుగుతూనే ఉన్నాయి. మస్క్ మీద మదుపర్లకు ఉన్న నమ్మకం మస్క్ నికర సంపదను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మస్క్ నికర విలువ ఏకంగా 9 బిలియన్ డాలర్లు పెరిగి 167.3 బిలయన్ డాలర్లకు చేరుకుంది. ఇది మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ నికర విలువ కంటే అధికం.

ఈ ఏడాది ఇప్పటిదాకా మస్క్ తన సంపదను 139.7 బిలియన్ డాలర్ల మేర పెంచుకోగలిగాడు. ప్రఖ్యాత మార్కెట్ సూచి ఎస్‌ఎండ్‌పీ 500 ఇండెక్స్‌లో టెస్టా షేర్లకు స్థానం లభించనుందన్న వార్తలు కూడా టెస్లా షేర్ల విలువ పెరిగుదలకు దోహదం చేసింది. ఈ ప్రకటన నవంబర్‌లో వెలువడింది. అప్పటి నుంచి నేటి వరకూ షేర్ల విలువ ఏకంగా 70 శాతం మేర పెరిగింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే టెస్లా షేర్ల విలువ 731 శాతం పెరిగింది. ఒకరకంగా చెబితే ఇది ఎలాన్‌పై కనక వర్షం కురుస్తున్నట్లే.

 కరోనా సంక్షోభం సమయంలోనూ షేర్ల ధరలు పెరిగిన కంపెనీల్లో టెస్లా కూడా ఒకటి. ఈ మహమ్మారి ప్రభావం ఏమాత్రం తాకని మరో అపర శ్రీమంతుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్. ఆయన నికర సంపద విలువ ప్రస్తుతం 187.3 బిలియన్ డాలర్లుగా ఉంది. మరో 20 బిలియన్ డాలర్లు పెరిగితే జెఫ్ బెజోస్‌ను కూడా ఎలాన్ మస్క్ అధికమించేస్తాడు. మస్క్ దూకుడు చూస్తుంటే త్వరలోనే ఆయన ఈ వరల్డ్ రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంటాడని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

 పర్యావరణం వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు పునరుత్పాదక ఇంధానాలు, హరిత రావాణా విధానాలవైపు మొగ్గు చూపుతున్నాయి. భవిష్యత్తులో రవాణా రంగం మొత్తం విద్యుత్ వాహనాలు చుట్టూనే తిరుగుతందనే అంచాలనాలకు ప్రస్తుతం పరిణామాలు ఊతం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనరంగంలో అగ్రగామిగా ఉన్న టెస్లా భవిష్యత్తులో కచ్చితంగా భారీ లాభాలు చూస్తుందని మదుపర్లు బలంగా నమ్ముతున్నారు. టెస్లా షేర్లకు విపరీతంగా డిమాండ్ పెరగడానికి ఇదే ప్రధాన కారణం.

దివాళా తీసే స్థాయి నుంచి కోలుకుని తిరుగులేని విధంగా దూసుకుపోతున్న ఎలాన్ మస్క్.. నిజంగా నేటి యువతకు ఓ స్ఫూర్తి. అతడి పోరాట పటిమ, పట్టుదలను ఆదర్శంగా తీసుకుంటే ఆకాశాన్నైనా తాకే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. హ్యాట్సాఫ్ ఎలాన్ మస్క్. రియల్లీ.. యు ఆర్ ఏ రోల్ మోడల్.

మరింత సమాచారం తెలుసుకోండి: