ముఖేష్‌ అంబానీ సోదరుడు అనిల్... రిలయన్స్ కమ్యూనికేషన్స్ కంపెనీ నుంచి తప్పుకున్నారు.  డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఆర్‌కామ్‌ కంపెనీని రక్షించలేక అనిల్‌ చేతులేత్తేశారు. ఆయనతో పాటు నలుగురు డైరెక్టర్లు కూడా కంపెనీకి రాజీనామా చేశారు.


ఓడలు బండ్లు కావడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు దేశంలోనే అపర కుబేరుడుగా ఒక వెలుగు వెలిగిన ఆయన ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఆఖరికి అన్నకు ఇష్టమైన కంపెనీని ఆస్తి పంపకంలో దక్కించుకొని, దానిని కూడా నిలుపుకోలేకపోయారు. చివరికి కంపెనీని కాపాడుకోలేక రాజీనామా చేశారు. ఆయన ఎవరో కాదు ముఖేష్‌ సోదరడు అనిల్‌ అంబానీ.


అనిల్‌ అంబానీ మాత్రమే కాకుండా ఆయనతోపాటు నలుగురు డైరెక్టర్లు కూడా కంపెనీకి రాజీనామా చేశారు. దివాలా ప్రక్రియ కింద ఆస్తులు అమ్మకానికి ఉంచిన రిలయన్స్ కంపెనీ నుంచి అనిల్‌ అంబానీతో పాటు ఛాయా విరాణి, రైనా కరానీ, మంజరి కకేర్‌, సురేష్‌ రంగాచారీలు డైరెక్టర్‌లుగా వైదొలిగారు. రిలయన్స్ కమ్యూనికేషన్స్ బీఎస్‌ఈకి ఇచ్చిన నోటీసులో ఈ అంశాన్ని తెలియజేసింది.  ప్రస్తుత ఆర్థిక ఏడాది రెండో త్రైమాసికంలో కంపెనీ నష్టాలు దాదాపు 30 వేల 142 కోట్లకు చేరాయి.


ఇప్పటికే అనిల్‌ అంబానీకి చెందిన నాలుగు ప్రధాన లిస్టెడ్‌ కంపెనీలు వేల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయాయ్. దీంతో దివాలా ప్రక్రియ ఆయన ఆస్తులను అమ్మకానికి ఉంచారు. పూర్తి దివాలాతో అప్పుల్లో చిక్కుకుపోయిన అనిల్‌ను సోదరుడు ముఖేష్‌ అంబానీ అదుకుంటారా అన్నది వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: