ఇంటర్నెట్ డెస్క్: బజాజ్ ఫైనాన్స్‌కు ఆర్బీఐ భారీ షాక్ ఇచ్చింది. నిబంధనలను అతిక్రమించినందుకు పెద్ద మొత్తంలో ఫైన్ చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలతో బజాజ్ ఫైనాన్స్‌కు భారీ దెబ్బ తగిలినట్లైంది. ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్‌ తాము నిర్దేశించిన రెగ్యులేటరీ నిబంధనలను సక్రమంగా పాటించడం లేదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఆర్బీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే బజాజ్ ఫైనాన్స్ కంపెనీపై రూ.2.5 కోట్ల జరిమానా విధిస్తున్నట్లు  రిజర్వు బ్యాంక్ ప్రకటించింది.

‘బజాజ్ ఫైనాన్స్ తన ఔట్‌సోర్సింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో మేనేజింగ్ రిస్క్స్ అండ్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్‌ను అతిక్రమించింది. అలాగే ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్ నిబంధనలు కూడా అతిక్రమించింది. అందుకే ఈ జరిమానా విధించాం. తమ నిబంధనలను అతిక్రమించే మిగతా సంస్థలకు కూడా ఇదో హెచ్చరిక’ అంటూ ఆర్బీఐ హెచ్చరించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్‌ 1934లోని సెక్షన్ 58జీ, 58బీలో ఉన్న పలు సబ్‌సెక్షన్ల కింద బజాజ్ ఫైనాన్స్‌పై జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.

రుణాలను రికవరీ చేసే సమయంలో వినియోగదారులను రికవరీ ఏజెంట్లు వేధింపులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇప్పటికే బజాజ్ ఫైనాన్స్‌పై తమకు అనేక ఫిర్యాదులు అందాయని, దానిని నియంత్రించడంలో సంస్థ వైఫల్యం చెందిందని, అందుకే ఈ స్థాయిలో జరిమానా విధించామని ఆర్బీఐ తెలిపింది.

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆన్‌లైన్ లోన్ అప్లికేషన్లపై విపరీతమైన వ్యతిరేకత వస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లో పోలీసులు ఈ సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రుణాలను రికవరీ చేసే సమయంలో రికవరీ ఏజెంట్లు వినియోగదారులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తూ వారు ఆత్మహత్య చేసుకొనేలా పురిగొల్పుతున్నారనే ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ యాప్‌ల వలలో చిక్కి అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆర్బీఐ ఆమోదం లేని అనేక అప్లికేషన్లను బ్యాన్ చేస్తూ, ఆ యాప్‌ల యాజమాన్యాలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: