ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో అప్పటి టీడీపీ నేత, ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.  ఇదే కేసులో టీటీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు కూడా ప్రముఖంగా వినిపించడం కలకలం రేపింది. అయితే ఈ  కేసు చాలాకాలంగా కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయింది. త్వరలో తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో తాజాగా ఆ కేసుకు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.


ఓటుకు నోటు కేసు అవినీతి  నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ సుప్రీం కోర్టు లో రేవంత్‌ రెడ్డి  వేసిన పిటిషన్  ను అత్యున్నత ధర్మాసనం కొట్టివేసింది. ఇదే విషయంపై గతంలో రేవంత్ దాఖలు  చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఇదే కేసులో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేసిన పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది.


కేసు విషయానికొస్తే 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు వ్యవహారం సంచలనం రేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి మద్దతివ్వాలంటూ నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లి రూ.50 లక్షలు ఇవ్వ చూపారని ఆరోపణలు వచ్చిన వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఈ వ్యవహారం అప్పట్లో రాజకీయ దుమారం లేపగా.. ఏసీబీ రంగంలోకి దిగి రేవంత్రెడ్డిని అరెస్టు చేసింది. ఆయన బెయిల్ పై  బయటకు వచ్చారు.
ఈ కేసులో ప్రధానంగా చంద్రబాబే సూత్రధారి అని సీఎం కేసీఆర్ ఆరోపించి ఆయన్ను జైలులో వేసేందుకు యత్నించారు.


ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. ఆ తర్వాత కేసు కూడా మరుగున పడిపోయింది. అయితే తాజాగా రేవంత్ రెడ్డి ఈ కేసు నుంచి తనను తప్పించాలని వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: