
ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఆ కూటమిలోకి బీజేపీని తీసుకురావాలని చూస్తోంది. అందులో భాగంగా పలుసార్లు కేంద్రం పెద్దలతో మాట్లాడాను అని కూడా పవన్ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసే ఎన్నికలకు వెళ్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పార్లమెంట్ లో బిల్లు సందర్భంగా వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దీంతో వైసీపీ, బీజేపీ మధ్య అగాథం ఏర్పడిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావొస్తున్నా.. కేంద్రం ఏపీకి విద్యా రంగానికి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, గిరిజన, ఐఐటీ, ఎన్ఐటీ ఇతర విశ్వ విద్యాలయాలు ఇచ్చినా ఒక్క సంస్థ కూడా శాశ్వత క్యాంపస్ లో పని చేస్తున్న పరిస్థితి లేదని ఆరోపించారు. వీటి అభివృద్ధిలో ఆశించన మేర ముందుకు సాగడం లేదని అభిప్రాయపడ్డారు.
పార్లమెంట్ లో విద్యా సంస్థల అభివృద్ధి పై మాట్లాడుతూ తెలంగాణలో సమ్మక్క సారక్క గిరిజన యూనివర్శిటీని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. ఏపీలో ఉన్న విశ్వ విద్యాలయాలకు నిధులు ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. గత రెండేళ్లలో విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కేవలం తమ చదువు కోసమే కాకుండా జీవన శైలి కోసం అక్కడికి వెళ్తున్నారు. కేంద్రం ఆత్మ నిర్భర్ వంటి పథకాల గురించి గొప్పలు చెప్పుకుంటుంటే ఇలాంటి స్థితి ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు. ఈనేపథ్యంలో బీజేపీకి వైసీపీకి చెడిందా అని పలువురు చర్చించుకుంటున్నారు.