రాజకీయాలు అంటే ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. ఇక్కడ  విజేతగా నిలబడాలంటే, అనుకున్నంత సులువైన వ్యవహారమేమీ కాదు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రజలకు సంబంధించిన సమస్యల మీద పోరాటం చేస్తూ, ఏదో ఒక అంశంపై హడావుడి చేస్తూనే ఉండాలి. రాజకీయ శత్రువుల బలం, బలహీనతల్ని అంచనా వేస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ, అన్ని విషయాల్లోనూ పైచేయి సాధించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఒకసారి ఈ రేసులో వెనకబడితే, ఇక కోలుకోవడం కష్టం. రాజకీయ చదరంగంలో ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ వెళ్లి గెలుపు జెండా ఎగుర వేయాలి. అధికారం అనేది దక్కాలంటే, ప్రజల్లో భరోసా కల్పించే విధంగా వ్యవహరించాలి. ప్రజల్లో నమ్మకాన్ని సంపాదించాలి. అప్పుడప్పుడు చుట్టం చూపుగా రాజకీయాలు చేస్తామంటే ఈ చదరంగంలో ఓటమి చవి చూడాల్సిందే. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెనుకబడినట్టుగా కనిపిస్తున్నారు.

IHG


 పవన్ కళ్యాణ్ ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు. ఆయన ఇప్పటికీ అగ్ర హీరోగా కొనసాగుతూ, పై మెట్టు లోనే ఉన్నారు. కోట్లాదిమంది అభిమానులు ఆయనకి ఉన్నారు. ముఖ్యంగా యువత అంతా ఆయనంటే విపరీతంగా అభిమానిస్తారు. అలాగే ఏపీలో బలమైన సామాజిక వర్గం అండదండలు కూడా పవన్ కు పుష్కలంగా ఉన్నాయి. అయినా రాజకీయంగా వెనకబదడానికి కారణం పవన్ స్వీయ తప్పిదాలే కారణంగా కనిపిస్తున్నాయి మొదటి నుంచి ఇదే రకంగా రాజకీయాల్లో అనుమానాస్పదంగా పవన్ ఉంటూ వస్తున్నారు. ఏ విషయంలోనూ క్లారిటీ లేనట్టుగానే వ్యవహరిస్తూ ఉండటం, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఆయన మరో పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నాడు అనే నిందను పవన్ ఇప్పటికీ మోస్తూనే వస్తున్నాడు. 

IHG


పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విషయంపై దృష్టి పెట్టకుండా, వేరే పార్టీల బలాన్ని తన బలంగా భావిస్తూ ముందుకు వెళుతున్న తీరు పవన్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా పవన్ వ్యవహరించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రతిపక్ష పార్టీపై విమర్శలు చేస్తూ, హడావుడి చేశారు. 2019 ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో పాటు పవన్ కూడా రెండు చోట్ల ఘోరాతి ఘోరంగా ఓటమి చెంది రాజకీయంగా కోలుకోలేని దెబ్బతిన్నారు. 

IHG


ఇప్పటికైనా పవన్ పార్టీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారా అంటే అదీ లేదు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. కానీ బీజేపీ నేతలు పవన్ ను పక్కన పెట్టేసినట్టుగా వ్యవహరిస్తుండడం, ఏ విషయంలోనూ వారు జనసేనను కలుపుకు వెళ్లేందుకు ఇష్టపడకపోవడం, జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత ఇప్పటికీ ఒక్కసారి కూడా పవన్ కు బీజేపీ అగ్రనేతలు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వంటి పరిణామాలు పవన్ కు కూడా ఆగ్రహం కలిగిస్తున్నాయి. అయినా దాన్ని ఎక్కడా కనిపించకుండా చేస్తూ, ముందు ముందు పార్టీ భవిష్యత్తు ఆశాజనకంగానే ఉంటుందనే అభిప్రాయంలో ఉంటున్నారు తప్ప ఇప్పటికీ జనసేన ను క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి, నాయకులకు భరోసా కల్పించే విధంగా వ్యవహరించలేకపోతున్నారు.

IHG


 అసలు పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయిలో చెప్పుకోదగిన నాయకులు పెద్దగా కనిపించడం లేదు. జిల్లా నియోజకవర్గ స్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉంది. పార్టీ కేడర్ ను ముందుండి నడిపించే నాయకులు నియోజకవర్గంలో ఎవరు లేరు. దాదాపు జనసేనకు అన్ని చోట్లా ఇదే పరిస్థితి ఉంది. కానీ పవన్ మాత్రం 2024 నాటికి అధికార పీఠం తమకే దక్కుతుందని, బిజెపి అండదండలతో అది సాధ్యం అవుతుందనే ధీమా లో ఉంటున్నారు. ఇక ఇప్పుడు కరోనా సమయంలో ఏపీ ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా కానీ, పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ, ప్రజలకు సహాయ సహకారాలు అందించే విషయంలో కానీ పవన్ ముందుకు రావడం లేదు. 

 

IHG


ముందు నుంచి హైదరాబాద్ కి పరిమితమైపోయిన ఆయన ఇప్పటికీ ఏపీ రాజకీయాలపై సోషల్ మీడియాలో తప్పితే ఏపీలో అడుగు పెట్టి పోరాడేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లే అవకాశం ఉన్నా, పవన్ ఆ విధంగా మాత్రం చేయలేకపోతున్నారు అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి ముందు ముందు కూడా ఇదే రకంగా ఉంటే, జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: