
మొత్తానికి మాజీమంత్రి ఈటల రాజేందర్ ను కేసీయార్ ప్రభుత్వం అన్నివైపులా బిగించేస్తోంది. తొందరలోనే రాజేందర్ హుజూరాబాద్ ఎంఎల్ఏగా రాజీనామ చేస్తారని కేసీయార్ అండ్ కో భావిస్తున్నారు. అప్పుడు ఉపఎన్నికలు అనివార్యమవుతుంది. ఎటుపోయి ఎటువస్తుందో అనే ముందుచూపుతోనే ఈటలను నియోజకవర్గంలో ఏకాకిని చేసే ప్రయత్నాలను ఇపుడే మొదలుపెట్టేశారు. ముందుగా ఈటల మద్దతుదారులను నియంత్రించటం, తర్వాత అత్యంత సన్నిహితులను దూరంచేయటం, అధికారయంత్రాంగం నుండి ఎలాంటి సహకారం అందకుండా చూడటమనే చర్యలకు కేసీయార్ ఇప్పటికే శ్రీకారం చుట్టేశారు. రాజేందర్ కు అత్యంత సన్నిహితుడు, మద్దతుదారుడైన వీణవంక ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం మాజీ ఛైర్మన్ సాధవరెడ్డిపై అప్పుడెప్పుడో నమోదైన కేసును ఇపుడు బయటకుతీసి నోటీసిచ్చింది.
వ్యవసాయసంఘంలో 2018లో జరిగిన రు. 18 లక్షల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో నోటీసిచ్చింది ప్రభుత్వం. రెడ్డితో పాటు అప్పటి పాలకవర్గం మొత్తం 18 లక్షల రూపాయలను చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామంటు ప్రభుత్వం నోటీసివ్వటం సంచలనంగా మారింది. నియోజకవర్గంలో పరిధిలోని సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మార్కెట్ కమిటి ఛైర్మన్లు, ఎంపిటిసీ, ఎంపిపిలు, జడ్పీటీసీ సభ్యులతో పాటు చివరకు జడ్పీ ఛైర్ పర్సన్ అంతా రాజేందర్ మద్దతుదారులే. అంటే నియోజకవర్గంలో ఎటుచూసినా ఇపుడున్న ప్రజాప్రతినిధులంతా ఈటల అనుచరులు, మద్దతుదారులే. అందుకే వీళ్ళందరినీ ఈటలకు దూరం చేసే ప్రణాళికను కేసీయార్ మొదలుపెట్టారు. వీరంతా ఈటల వెంటే ఉంటే ఉపఎన్నికలో రాజేందర్ ను ఓడించటం అంత సులభంకాదని కేసీయార్ కు అర్ధమైంది.
ఎప్పుడైతే సాధవరెడ్డికి నోటీసు అందిందో వెంటనే ఇతర ప్రజాప్రతినిధులు అలర్టయ్యారు. ప్రజా ప్రతినిధుల రూపంలో వందలసంఖ్యలో ఉన్న ఈటల మద్దతుదారులు ఇపుడేమి చేప్తారో చూడాలి. అలాగే నియోజకవర్గంలో ఉన్న అధికారులంతా రాజేందర్ మనుషులే. ఎక్కడెక్కడో పనిచేస్తున్న రెవిన్యు, మున్సిపల్, పోలీసులు, పంచాయితీరాజ్ లాంటి అనేక విభాగాల్లోని అధికారులను ఈటెలే ఏరికోరి తన నియోజకవర్గంలో వేయించుకున్నారు. కాబట్టి వారంతా సహజంగా రాజేందర్ చెప్పిన మాటే వింటారు. కాబట్టి ఇదే అనుమానంతో వీళ్ళందరినీ ఏకమొత్తంలో బదిలీ చేయాలని కేసీయార్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం కేంద్రంలో పనిచేస్తున్న ఏసీపీని ప్రభుత్వం బదిలీచేసింది. కాబట్టి తొందరలోనే మిగిలిన అధికారులను కూడా బదిలీ చేసేస్తారనే ప్రచారం పెరిగిపోతోంది. మొత్తానికి రాజీనామాకు ముందే ఈటలను అన్నీవైపులా కేసీయార్ బిగిచేస్తున్న విషయం తెలిసిపోతోంది. మరి ఉపఎన్నికలంటు వస్తే జనాలు ఏ విధంగా రియాక్టవుతారో చూడాల్సిందే.