పంట విరామం.. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్తగా వినిపిస్తున్న పదం. ఈ ఏడాది పంట విరామం పాటిస్తామని కోనసీమతో పాటు పలు ప్రాంతాల రైతులు చెబుతున్నారని టీడీపీ అంటోంది. ఎందుకంటే.. రైతాంగ సమస్యలను వైసీపీ సర్కారు పరిష్కరించట్లేదు కాబట్టి రైతులు ఆగ్రహంతో ఈ నిర్ణయం తీసుకున్నారని టీడీపీ చెబుతోంది. అయితే ఈ వాదనను వైసీపీ పూర్తిగా తిప్పికొడుతోంది.


ఎవరో పదిమంది టీడీపీ కార్యకర్తలను తీసుకొచ్చి పంట విరామం అని డ్రామా చేస్తున్నారని.. సాక్షాత్తూ వైసీపీ మంత్రులే విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో  వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కీలక ప్రకటన చేశారు. అసలు రాష్ట్రంలో ఎక్కడా పంట విరామం లేదని పూనం మాలకొండయ్య అంటున్నారు. ఈ పంట విరామం అన్న ఇష్యూ కేవలం పత్రికల్లోనే చూస్తున్నామని.. కానీ.. గ్రౌండ్‌లో అలాంటి పరిస్థితి లేదని ఆమె తేల్చి చెప్పారు.


తాను కలెక్టర్లతో నిత్యం మాట్లాడుతున్నానని.. కాల్వలు బాగు చేయడం.. ధాన్యం సొమ్ము ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఉన్న సంగతి నిజమేనని.. కానీ..అవి పంట విరామం చేసేంత పెద్దవి కాదని.. ఆ సమస్యలను తాము పరిష్కరిస్తున్నామని  వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అంటున్నారు. అంతే కాదు.. పంటల బీమా కింద 15 లక్షల 60 వేల మందికి లబ్ధి చేకూరిందని పూనం మాలకొండయ్య చెబుతున్నారు.


ఏపీలో  రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయన్న వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య అపోహలతో కౌలు రైతులు సీసీఆర్సీ కార్డులు తీసుకోవట్లేదని చెబుతున్నారు. వైఎస్ఆర్ పంటల బీమా కింద ఈసారి 15 లక్షల 60 వేల 703 మంది రైతులకు 2977 కోట్ల రూపాయల అందించామని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చెప్పారు. పంటల భీమా పథకంలో పంట నష్ట పరిహారం అందని రైతులు 15 రోజులలోగా మళ్లీ అభ్యంతరాలు తెలియచేయవచ్చని పూనం మాలకొండయ్య తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: