పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో అన్ని పార్టీలు గెలుపు వ్యూహాలపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాయి. అయితే తెలంగాణ  పార్లమెంట్ అనగానే ఠక్కున గుర్తు వచ్చేది హైదరాబాద్ లోక్ సభ స్థానమే. ఇక్కడ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బరిలో నిలవడమే దీనికి ప్రధాన కారణం.


1989 నుంచి ఆ పార్టీకి అక్కడ ఓటమే లేదు. వరుసగా తొమ్మిది సార్లు ఎంఐఎం అక్కడి నుంచి గెలుస్తూ వస్తోంది. ఈ సారి ఇక్కడ ఎలాగైనా పట్టు సాధించాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. మిగతా పార్టీలు అభ్యర్థులను ప్రకటించినా అది నామమాత్రమే. బాహాటంగానే అధికార పార్టీ నేతలు వారికి మద్దతు తెలుపుతూ ఉంటారు. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షంగా ఎంఐఎం ఉంది. ప్రభుత్వంలో భాగస్వామి అయింది. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడంతో ఇప్పుడు ఎంఐఎం చూపు కాంగ్రెస్ వైపు మళ్లింది.


కాంగ్రెస్ కూడా బొటాబొటీ మెజార్టీ సాధించడంతో ఈ పార్టీ అండ రేవంత్ ప్రభుత్వానికి తప్పనిసరిగా కావాల్సి వస్తోంది. ఈక్రమంలో అక్కడ అసదుద్దీన్ ఓవైసీ పై బలమైన అభ్యర్థిని బరిలో దింపి నిజంగా ఆయన ఓటమికి సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలు పన్నుతారా అంటే అనుమానమే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి మెజార్టీ కావాలంటే ఎంఐఎం మద్దతు అవసరం.

లోక్ సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ ఓటమికి కాంగ్రెస్ తెరవెనుక పావులు కదిపితే అది ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో పూర్తిస్థాయి అంటే 88 సీట్లు సాధించిన బీఆర్ఎస్సే ఆ పార్టీ జోలికి వెళ్లలేదు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ ఈ సాహసం చేస్తారా అంటే కచ్ఛితంగా చేయలేరు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఓవైసీ పై పోరాటం చేయాలంటే కనీసం 80పైగా స్థానాల్లో విజయం సాధిస్తే దీనికి ప్రయత్నించేదని.. ప్రస్తుతం ఆ ఆలోచన కూడా హస్తం పార్టీ చేయలేదని పలువురు పేర్కొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: