కరోనా టీకాలపై అనేక అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆ అపోహలను కొట్టిపారేసింది. ఇప్పటికే దాదాపు 23 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. వారిలో కేవలం ఒకే ఒక వ్యక్తి కరోనా టీకాతో వచ్చిన అలర్జీ లక్షణాలతో చనిపోయినట్టు కేంద్రం ఇచ్చిన నివేదిక తెలిపింది. అయితే.. ఇంకా జనంలో అనేక అపోహలు ఉన్నాయి. కరోనా టీకా ఎవరు తీసుకోవాలి.. ఎవరు తీసుకోకూడదు.. కరోనా టీకాతో వచ్చే ఇబ్బందులేంటి.. అనే వాటిపై అవగాహన కొరవడింది.

అయితే మరో ప్రచారం ఏంటంటే.. కరోనా టీకా లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తుందని.. పురుషుల్లోని వీర్య  కణాల సంఖ్యను టీకా తగ్గిస్తుందని కూడా అపోహలు ఉన్నాయి. ఈ అంశాలపై తాజాగా అమెరికాలో ఓ ఓ అధ్యయనం జరిగింది. 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్లపై అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మియామి పరిశోధకులు ఈ స్టడీ నిర్వహించారు. ఈ అధ్యయనం ప్రకారం పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యానికి ఫైజర్‌, మోడెర్నా టీకాలు ఏమాత్రం హాని కలిగించవట. ఈ టీకాలు వీర్యకణాల సంఖ్యను తగ్గించవట.  

ఈ అధ్యయనం ఎలా చేశారంటే.. తొలి డోసు వేయడానికి వారం రోజుల ముందు 18-50 ఏళ్ల మధ్య వయసున్న 45 మంది వాలంటీర్ల నుంచి వీర్యం సేకరించారు. వారికి రెండో డోసు పూర్తయ్యాక మళ్లీ 70 రోజులకు మళ్లీ వీర్యం తీసుకున్నారు. ఈ వీర్యాన్ని ల్యాబ్‌లో డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలకు అనుగుణంగా పరిశీలించారు. వీర్యం పరిమాణం, గాఢత, వీర్యకణాల చలనశీలత వంటి అంశాలను నిశితంగా గమనించారు.

టీకా వేయించుకున్నాక ఏ ఒక్కరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గలేదని ఈ అధ్యయనం తేల్చింది.  మరో షాకింగ్ ఫలితం ఏంటంటే.. రెండు డోసులు పూర్తయ్యాక వారిలో వీర్యకణాల సంఖ్య, చలనశీలత కొంత పెరిగిందట కూడా. ఇంకో విషయం ఏంటంటే.. ఫైజర్‌, మోడెర్నాల్లో సజీవ వైరస్‌ కాకుండా ఎంఆర్‌ఎన్‌ఏ ఉంటుంది. ఇది వీర్యంపై అవి ప్రభావం చూపే అవకాశాలే లేవట. సో.. మగాళ్లూ ఇక అపోహలు వీడండి. కరోనా టీకాలు వేయించుకోండి.


మరింత సమాచారం తెలుసుకోండి: