
అద్దాలు లేకుండా ప్రపంచాన్ని చూసేందుకు అందరూ ఆరాటపడుతుంటారు. మరి అలా ఉండాలంటే, మన కళ్ళ సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రస్తుత కాలంలో చాలామంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. గంటల తరబడి కంప్యూటర్లు, ఫోన్లు చూడటం వల్ల కళ్ళు పొడిబారడం, మంటలు, దురదలు, కళ్ళ కింద నల్లటి వలయాలు, కంటి చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న వయసులోనే అద్దాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సరైన పోషణతో, తగిన జాగ్రత్తలతో కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఎక్కువ సమయం ఫోన్, టీవీ, కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు మధ్యమధ్యలో బ్రేక్ తీసుకోవడం చాలా ముఖ్యం. కళ్ళను అటూఇటూ, పైకి కిందికి తిప్పడం, పది సెకన్ల పాటు కనురెప్పలను మూసి తెరవడం వంటివి చేయడం వల్ల కళ్ళకు విశ్రాంతి దొరుకుతుంది. అలాగే, అరిచేతులను వేడి చేసి కళ్ళపై ఉంచడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
కంటి చూపు మెరుగుపడాలంటే, విటమిన్ ఎ, సి, ఇ, జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవాలి. క్యారెట్లు, ఆకుకూరలు, బీట్ రూట్, బొప్పాయి, నారింజ, బాదం, చేపలు వంటివి మీ డైట్లో భాగం చేసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
శరీరంలో తగినంత నీరు లేకపోతే, కళ్ళు పొడిబారతాయి. ఇది కంటి ఇన్ఫెక్షన్లకు కూడా దారితీయవచ్చు. కాబట్టి రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. కంటి కండరాలకు విశ్రాంతి అవసరం. సరైన నిద్ర లేకపోతే కళ్ళ కింద నల్లటి వలయాలు, అలసట, దురదలు, మంటలు వంటి సమస్యలు వస్తాయి. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు సూర్యరశ్మి, దుమ్ము, ధూళి, కాలుష్యం నుంచి రక్షణ కోసం మంచి నాణ్యత గల సన్ గ్లాసెస్ ధరించడం మంచిది. అలాగే, నీటితో కళ్ళను తరచుగా కడుక్కోవడం వల్ల కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది.