కామెడీ మూవీస్‌తో ఒకానొక సమయంలో టాప్ చైర్‌ని టార్గెట్ చేశాడు శ్రీను వైట్ల. 'ఢీ, రెడీ, దూకుడు' లాంటి బ్లాక్‌బస్టర్‌తో టాప్ హీరోస్‌తో సినిమాలు చేసే అవకాశం అందుకున్నాడు. అయితే 'ఆగడు' తర్వాత వైట్లకి విజయాలు దూరమయ్యాయి. 'మిస్టర్, అమర్ అక్బర్ ఆంటొని' ఫ్లాపులతో వైట్ల మార్కెట్‌ కూడా పడిపోయింది. టాప్ హీరోలు పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మంచు విష్ణుతో 'ఢీ అండ్ ఢీ' అనే సినిమా తీస్తున్నాడు.

మాస్‌ హిట్స్‌తో టాప్ హీరోస్‌ని డైరెక్ట్‌ చేసిన వి.వి.వినాయక్‌ 'ఇంటిలిజెంట్'  ఫ్లాప్‌తో స్లో అయ్యాడు. అప్పటికే 'అల్లుడు శీను, అఖిల్‌-ది పవర్‌ ఆఫ్ జువా' ఫ్లాపులుండడంతో వినాయక్‌ గ్రాఫ్‌ కూడా పడిపోయింది. మళ్లీ సూపర్‌ హిట్‌ కొడితేనే మునుపటి మార్కెట్‌ సంపాదించే స్టేజ్‌కి పడిపోయాడు. ఈ సిట్యువేషన్‌ నుంచి బయటపడ్డానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో 'ఛత్రపతి' రీమేక్‌ చేస్తున్నాడు.

తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టే కనిపించాడు. కానీ ఆ తర్వాత 'సీత' సినిమాతో మళ్లీ ఫ్లాపుల్లో పడ్డాడు. తేజ మార్క్‌ పనిచేయడం లేదనే కామెంట్స్ కూడా వినిపించాయి. ఇలాంటి బ్యాడ్‌ ఫేజ్‌లో 'రాక్షసరాజు రావణాసురుడు, అలిమేలుమంగ వెంకటరమణ, చిత్రం 1.1' సినిమాలు అనౌన్స్ చేశాడు. ఆ తరవాత వాటిని పక్కనపెట్టి రానా తమ్ముడు అభిరామ్ హీరోగా 'అహింస' అనే సినిమా తీస్తున్నాడు.

'స్వామిరారా' సినిమాతో మంచి మార్కులు తెచ్చుకున్న సుధీర్‌ వర్మకి ఆ తర్వాత వరుస ఫ్లాపులు వచ్చాయి. 'దోచెయ్, కేశవ' ఫ్లాపులతో ఈ దర్శకుడికి షాకులు తగిలాయి. ఇక లాస్ట్ మూవీ 'రణరంగం' అయితే సుధీర్ వర్మ ఇమేజ్‌ని కంప్లీట్‌గా డామేజ్ చేసింది. కంపల్సరీగా హిట్‌ కొడితేనే కెరీర్‌ నిలబడుతుంది అనే స్టేజ్‌లో రవితేజతో 'రావణాసుర' అనే సినిమా తీస్తున్నాడు సుధీర్ వర్మ.

'కార్తికేయ, ప్రేమమ్' సినిమాలతో మెప్పించిన చందూ మొండేటికి 'సవ్యసాచి' గట్టి స్ట్రోక్‌ ఇచ్చింది. చైతన్యని మాస్‌ లుక్‌లో చూపించి, బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా పడ్డాడు. దీంతో ఈ దర్శకుడి గ్రాఫ్‌ కూడా పడిపోయింది. దీంతో ఈ స్లంపు నుంచి బయటపడ్డానికి 'కార్తికేయ 2' మొదలుపెట్టాడు చందు మొండేటి.

'ఆర్.ఎక్స్.100'తో సూపర్ హిట్‌ కొట్టిన అజయ్‌ భూపతి ఆ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్‌ హీరోలుగా 'మహాసముద్రం' తీశాడు. ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ డైరెక్టర్‌ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడ్డానికి కార్తికేయతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు అజయ్‌ భూపతి.


మరింత సమాచారం తెలుసుకోండి: