తెలుగు ఇండ్రస్టీలో కథానాయికల కొరత గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన హీరోయిన్లు చాలా తక్కువ మంది పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు.మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల నుంచి కథానాయికలు తెలుగు ఇండ్రస్టీ వైపునకు అవకాశాల కోసం వస్తున్నారు. గతంలో ఎక్కువగా ముంబై నుంచి వచ్చేవారు. ఈ మధ్యకాలంలో మలయాళం, తమిళ్‌, కన్నడ ప్రాంతాల నుంచి నటీమణులు దిగుమతి అవుతున్నారు. పెద్ద హీరోల సినిమాల్లో హీరోయిన్‌ పాత్ర డ్యాన్స్‌ చేయటం, గ్లామర్‌ ప్రదర్శించటమే తప్ప మిగతా నామమాత్రమే. లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలకు కూడా ఆదరణ ఉంటోంది. అలాంటి సినిమాల విజయాల్లో కూడా పాలుపంచుకునే అవకాశం ఉంటోంది. ఈ మార్పుల వల్ల అనేక మంది నాయికలకు అవకాశాలు కూడా దొరుకుతున్నాయి. సినిమాల ఫలితంతో సంబంధం లేకుండా వేషాలు వరిస్తున్నాయి. అయితే ఇప్పటికే పరిశ్రమలో పాతుకుపోయిన వారికి కూడా క్రేజ్‌ ఏమీ తగ్గటం లేదు. సీనియర్‌ హీరోయిన్లు సైతం బిజీగా ఉంటున్నారు. వీరితోపాటుగా వర్థమాన నాయికలు సైతం సినిమాలు చేస్తున్నారు. ఇది కూడా ఆహ్వానించదగిన పరిణామంగా చిత్రవర్గాలు పేర్కొంటున్నాయి. హీరో రాజశేఖర్‌ కుమార్తె శివాని రాజశేఖర్‌ కోటబొమ్మాలి పిఎస్‌ సినిమా ద్వారా అలరించారు. పాయల్‌రాజ్‌పుత్‌ 'ఆర్‌ఎక్స్‌ 100'తో సూపర్‌ హిట్‌ అందుకున్నా ఆ తర్వాత వరుస పరాజయాలను చవిచూశారు. మళ్లీ 'మంగళవారం' సినిమాతో హిట్‌ను అందుకున్నారు. పాత హీరోయిన్‌ శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌తో కలిసి 'దేవర'లో నటిస్తున్నారు.
ట్రెండ్‌ మారింది
గతంలో ఫ్లాప్‌ సినిమాలో నటించిన నాయికలకు అవకాశాలు ఉండేవి కావు. ఇప్పుడు ట్రెండ్‌ మారినట్లుగా కనిపిస్తోంది. భామల కెరీర్‌పై పరాజయాల ప్రభావం తక్కువగానే కనిపిస్తోంది. ప్లాపులున్నప్పటికీ కొందరు హీరోయిన్లను పిలిచి దర్శక నిర్మాతలు అవకాశాలు ఇస్తున్నారు. హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ 'వీరసింహారెడ్డి', 'వాల్తేరు వీరయ్య', 'సలార్‌'లాంటి పెద్ద విజయాలను అందుకున్నారు. అడవి శేషు సినిమా 'డకాయిట్‌', హాలీవుడ్‌ చిత్రం 'ది ఐ'లో కూడా నటించారు. 'సలార్‌-2'లో కూడా ఆమె కీలకపాత్రలో నటిస్తున్నారు. 'వారసుడు', 'యానిమల్‌' చిత్రాలతో అలరించిన రష్మిక అల్లు అర్జున్‌తో కలిసి 'పుష్ప-2 ది రూల్‌'లో నటిస్తున్నారు. ఇవే కాకుండా ఆమె ప్రధాన పాత్రలో 'రెయిన్‌బో, 'ది గర్ల్‌ ఫ్రెండ్‌' సినిమాలు రాబోతున్నాయి. 'దసరా'తో విజయాన్ని అందుకున్న కీర్తిసురేష్‌ కూడా పలు సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె ప్రస్తుతం 'రఘుతాత', 'రివాల్వర్‌ రీటా', 'కన్నివేడి' సినిమాల్లో నటిస్తున్నారు. సమంత టైటిల్‌రోల్‌లో చేసిన 'శాకుంతలం' బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశపర్చింది. అయితే విజరు దేవరకొండతో చేసిన 'ఖుఫి ఖుషి..' కాస్త ఆదరణ పొందటంతో ఆమెలో జోష్‌ నింపిందనే చెప్పాలి. అనారోగ్యం సమస్యల నుంచి కోలుకున్న ఆమె కూడా ఇక నుంచి వరుస సినిమా ప్రాజెక్టులపై నటించే అవకాశం ఉంది. 'సిటాడెల్‌' ఓటీటీ సిరీస్‌లో కూడా ఆమె నటించారు. 'భారతీయుడు-2', 'సత్యభామ' చిత్రాల్లో కాజల్‌ నటించారు. 'ఉమ' అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. గతేడాది 'మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' చిత్రంతో ఆకట్టుకున్న అనుష్క తాజాగా కొత్త సినిమాలపై దృష్టిపెట్టారు. 'భాగమతి'కి పార్ట్‌ 2 చేయటానికి సన్నాహాలు జరుగుతున్నట్లుగా సమాచారం. 'కథనార్‌ ది వైల్డ్‌ సోర్సెరర్‌' అనే మలయాళం సినిమాను అంగీకరించారు. గతేడాది తీరికలేకుండా వరుస సినిమాలతో శ్రీలీల బిజీగా ఉన్నారు. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగిస్తున్నారు. మహేష్‌బాబుతో గుంటూరు కారంతో సందడి చేశారు. పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌సింగ్‌లోనూ ఆమెనే హీరోయిన్‌. ఇండిస్టీలో శ్రీలీల తర్వాత మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది. మీనాక్షి చౌదరి విజరుతో గోట్‌ సినిమాలో నటిస్తున్నారు. వరుణ్‌తేజ్‌తో మట్కా, దుల్కర్‌ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్‌', విశ్వక్‌సేన్‌తో ఓ సినిమా చేయబోతున్నారు. పూజాహెగ్డే గతేడాది తక్కువ సినిమాలే చేశారు. గుంటూరు కారం సినిమాకు మొదట ఆమెనే ఎంపిక చేశారు. ఆమె తప్పుకోవటంతో మీనాక్షిచౌదరి ఛాన్స్‌ దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌ సినిమాలపై దృష్టిసారించారు. సాహిద్‌కపూర్‌తో 'దేవా' చిత్రం చేస్తున్నారు. ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లే అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ సినిమాకు పూజానే హీరోయిన్‌గా తీసుకునే అవకాశం ఉందని సమాచారం. సీతారామం తర్వాత సినిమాల సంఖ్య కంటే పాత్రలపైనే మృణాల్‌ఠాకూర్‌ కేంద్రీకరించారు. గతేడాది 'హారునాన్న'తో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టులు అంగీకరించారు. గతేడాది లియో, 'పీఎస్‌ 2'తో సందడి చేసిన త్రిష స్పీడు పెంచారు. వశిష్ట దర్శకత్వం చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర', మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్‌ నటిస్తున్న 'థగ్‌ లైప్‌'లో ఆమెనే హీరోయిన్‌. 'రామ్‌', 'ఐడెంటిటీ' అనే మలయాళ సినిమాల్లోనూ నటిస్తున్నారు. సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో కలిసి 'తండేల్‌'లో నటిస్తున్నారు. బాలీవుడ్‌లో రామాయణంలో సీత పాత్రలో కనిపించనుంది. సాయిపల్లవి, కృతిశెట్టి, రాశీఖన్నా తదితర కథానాయికల సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. 'ఉప్పెన' విజయం తర్వాత కృతిశెట్టికి మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదు. అయినా ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో బిజీగానే ఉంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: