తెలుగు సినిమా పరిశ్రమలో గురువు – శిష్యుల అనుబంధం అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు సుకుమార్. ఓ మంచి కథాకర్త, ఓ మాస్టర్‌ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా తన శిష్యుల కెరీర్‌లను గట్టిపట్టుతో ముందుకు నడిపించే గుణం ఆయనది. ఈ కోవలోనే పుట్టింది సుకుమార్ రైటింగ్స్. సరిగ్గా పదేళ్ల క్రితం ఆరంభమైన ఈ సంస్థ ఇప్పుడు పరిశ్రమలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన సినిమాలు కేవలం బాక్సాఫీసు దగ్గరే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లోనూ నిలిచిపోయాయి. కుమారి 21 ఎఫ్ లాంటి యూత్ హిట్, పుష్ప లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్, గాంధీ తాత చెట్టు లాంటి సామాజిక సందేశం ఉన్న కంటెంట్ సినిమాలు —ఇలా అన్నీ అందిస్తూ సుకుమార్ రైటింగ్స్ తనదైన బ్రాండ్ క్రియేట్‌ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే బుచ్చిబాబు సనా (ఉప్పెన), కార్తీక్ దండు (విరూపాక్ష), ప్రతాప్ వంటి కొత్త టాలెంట్లు మెరుస్తూ బయటకు రావడంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించింది.


ఇక రాబోయే కాలంలో ఈ సంస్థ ఇంకా వేగం పెంచబోతోంది. 2025–26 మధ్యలోనే ఆరు సినిమాలు లైనప్‌లో పెట్టారు. వీటిలో ఎక్కువ శాతం సుకుమార్ శిష్యులకే దక్కాయి. అయితే కేవలం తన దగ్గర శిష్యరికం చేసిన వాళ్లకే కాదు - కథ నచ్చితే, ప్రతిభ కనిపిస్తే ఎవరినైనా తన బ్యానర్‌లోకి తీసుకోవడానికి సుకుమార్ వెనుకాడడం లేదు. అందుకే సుకుమార్ రైటింగ్స్ ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌజ్‌లతో కూడా టైఅప్ అవుతోంది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందంటే, నెట్‌ఫ్లిక్స్‌తో సుకుమార్ రైటింగ్స్ కలయికలో కొన్ని సినిమాలు రావడం. థియేటర్స్‌లో హిట్స్ కొట్టడమే కాదు, ఓటీటీలో కూడా తన బ్యానర్ పేరును బలంగా నిలిపే ప్లాన్‌లో ఉన్నారు సుకుమార్. దాంతో, కొత్త టాలెంట్‌కు అవకాశాలు ఇవ్వాలన్న ఆయన సంకల్పం మరింత విస్తృతమవుతుంది.



ఈ తరం దర్శకులలో ఇంత మంది శిష్యులు ఒకే వ్యక్తి నుంచి బయటకు వచ్చి విజయాలు సాధించడం అరుదైన విషయం. కానీ సుకుమార్ దగ్గర ఇది సాధ్యమైంది. తన శిష్యుల ప్రాజెక్టులు కూడా హిట్ అవ్వాలని ఆయన వెనక నుంచి అండగా నిలబడుతున్నారు. ఒకవైపు రామ్ చరణ్‌తో కొత్త కథ సిద్ధం చేస్తూనే, మరోవైపు శిష్యుల సినిమాలకు సహకారం అందిస్తూ బిజీగా ఉన్నారు. పదేళ్ల సుకుమార్ రైటింగ్స్ అనేది కేవలం ఒక ప్రొడక్షన్ హౌజ్‌ కథ కాదు. అది ఒక పాఠశాల కథ. టాలెంట్ ఉన్న వాళ్లను వెలుగులోకి తీసుకువచ్చిన వేదిక. రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలు పరిశ్రమకు కొత్త గాలి పోసేలా ఉంటాయని సినీ వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: