సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏ చిన్న విషయం అయినా క్షణాల్లో వైరల్ అవ్వడం, ట్రెండ్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. స్టార్ హీరోలకి, ముఖ్యంగా టాప్ లెవల్ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు అయితే మరీ ఎక్కువగా హైలైట్ అవుతుంటాయి. ప్రస్తుతం అలాంటి హాట్ టాపిక్‌గా మరోసారి అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది పాత విషయం అయినా ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతోంది. "పుష్ప2" సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్‌పై సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏసీపీ సభ్యత విష్ణుమూర్తి చేసిన ప్రెస్ మీట్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో ఆ ప్రెస్ మీట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.


ఆనాటి ప్రెస్ మీట్‌లో ఏసీపీ విష్ణుమూర్తి మాట్లాడుతూ — “ఈ మధ్య కొంతమంది డబ్బు ఉన్న స్టార్స్ తమ మదంతో బడా బాబుల్లా ప్రవర్తిస్తున్నారు. అల్లు అర్జున్ లాంటి ప్రముఖుడు  ప్రెస్ మీట్స్ పెట్టి పోలీసులను విమర్శించడం తగదు. పోలీసులుగా మేము రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పనిచేస్తాం. ఎవరు పెద్ద సెలబ్రిటీ అనేది మా విధుల్లో మార్పు చేయదు” అంటూ ఘాటుగా స్పందించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, “అర్జెంటుగా బందోబస్తు కావాలి అంటే అది సాధ్యం కాదు. రూల్స్, ప్రొసీజర్స్ ఉంటాయి. పోలీస్ శాఖలో ప్రతి ఒక్కరికి కూడా వారి వారి బాధ్యతలు ఉంటాయి. మాకు కూడా ఫ్యామిలీలు ఉంటాయి, మాకు కూడా ఆకలి, దప్పిక ఉంటాయి. స్టార్ సెలబ్రిటీలు మాత్రమే మనుషులు కాదుకదా” అంటూ స్పష్టంగా చెప్పారు.



అంతేకాక, “అల్లు అర్జున్ తన పరిధిని దాటి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మేము పోలీసులమని మన పరిధి దాటి ప్రవర్తిస్తే ఇబ్బంది పడేది స్టార్ సెలబ్రిటీలే అవుతారు. పోలీసులపై కామెంట్లు చేయడం కంటే, మా పరిస్థితిని, మా డ్యూటీ నేచర్‌ ను అర్థం చేసుకోవాలి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పుడు చాలా వైరల్ అయ్యాయి. ఆ టైంలో ఆ ప్రెస్ మీట్ ప్రతి పోలీస్ ఆఫీసర్‌ని, ప్రతి సామాన్య పౌరుడిని ఆలోచింపజేసేలా మారింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్, పోలీస్ కమ్యూనిటీ మధ్య పెద్ద చర్చే నెలకొంది.



ఇప్పుడు ఆ ఘటన మళ్లీ ఎందుకు ట్రెండ్ అవుతోంది అంటే — రీసెంట్‌గా ఏసీపీ విష్ణుమూర్తి గారు హార్ట్ ఎటాక్ కారణంగా కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఆయన మరణించారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పాత వీడియోలు, ముఖ్యంగా అల్లు అర్జున్ పై చేసిన ఆ ప్రెస్ మీట్ క్లిప్స్ తిరిగి ట్రెండ్ అవుతున్నాయి. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన విష్ణుమూర్తి గారు క్రమశిక్షణకు, నిబద్ధతకు గుర్తింపు పొందిన అధికారి. తలపై మూడు సింహాలను దైవంగా నమ్మి, ప్రజాసేవను ధర్మంగా భావించి నిరంతరం సమాజ సేవలో కృషి చేశారు. ఆయన మరణం పోలీస్ డిపార్ట్‌మెంట్‌ కి, ప్రజలకు పెద్ద నష్టం అని సహచరులు, అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ అల్లు అర్జున్ – ఏసీపీ విష్ణుమూర్తి ఎపిసోడ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన చెప్పిన ప్రతి మాట నేటికీ పోలీస్ వర్గాల్లో గౌరవంగా గుర్తుచేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: