
ఇప్పుడు ఆ సమీకరణం పూర్తిగా మారింది. మజ్లిస్ పార్టీ ఈసారి బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వడం లేదు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఆయన అనుచరులలో విభేధాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భార్య మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చి సానుభూతి ఓట్లు ఆశిస్తోంది. కానీ ఆ సానుభూతి ఎంతవరకు గెలుపును అందిస్తుందన్నది అనుమానంగా మారింది. కాంగ్రెస్ విషయానికొస్తే, అధికార హోదా వల్ల జోష్‌లో ఉంది. గత ఎన్నికల్లో అజహర్ చివరి క్షణంలో టిక్కెట్ పొందినా రెండో స్థానంలో నిలిచారు. ఈసారి మాత్రం కాంగ్రెస్ మజ్లిస్ మద్దతుతో మరింత బలంగా పోటీ చేయనుంది. మజ్లిస్ పార్టీ ఎప్పటిలాగే అధికార పార్టీకి మద్దతు ఇవ్వవచ్చనే అంచనాలు ఉన్నాయి.
కాంగ్రెస్ తరఫున బస్తీల్లో బలమైన పట్టు ఉన్న నవీన్ యాదవ్ పేరును అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. ఇది మైనార్టీ, బస్తీ ఓటర్లను ఆకర్షించగలదని పార్టీ నేతలు భావిస్తున్నారు. గతంలో ఉపఎన్నికలు అంటే బీజేపీ పెద్ద ఎత్తున హడావుడి చేసేది. దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ పోటీగా మారింది. కానీ ఈసారి బీజేపీ ఆ ఉత్సాహాన్ని చూపించడం లేదు. అభ్యర్థిని నిలబెట్టినా, గెలుపు రేసులో ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోరుగా మారింది. మజ్లిస్ మద్దతు, అధికార పార్టీ అడ్వాంటేజ్, రేవంత్ వ్యూహాలతో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యంలో ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఉపఎన్నిక ఫలితం హైదరాబాద్ నగర రాజకీయాల భవిష్యత్తును నిర్ణయించే కీలక సూచికగా నిలవనుంది.