ఒక సినిమాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్ మరియు హీరో ఒకరే ఉండడం మన చూస్తూనే ఉంటాం. అయితే ఒక సినిమా మొత్తంలో ఒక్క మనిషే ఉంటే..? ఒకే ఒక్క క్యారెక్టర్.... సినిమా అంతా మిమ్మల్ని అలరిస్తే ఎలా ఉంటుంది? దీనినే సోలో యాక్ట్ మూవీ అంటారు. ఇలాంటి ఒక చిత్రమే తమిళనాడు నటుడు పార్థిబన్ (నేను రౌడీనే సినిమా లో విలన్) తన సొంత దర్శకత్వంలో తనే నిర్మించుకుంటూ... తను ఒక్కడే నటించాడు. అదే 'ఒత్త సెరుప్పు సైజ్ 7' అనగా 'ఒక చెప్పు సైజ్ 7'. ఇటువంటి సినిమా భారత దేశంలో 1964 తర్వాత ఇదే రావడం. మొత్తం మీద ప్రపంచంలోనే ఇది 19వ సోలో యాక్ట్ మూవీ.

ఇక ఈ చిత్రం విషయానికి వస్తే ఒక మధ్య వయస్కుడైన పార్థిబన్ ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుంటాడు. అతని పై హత్య చేశాడని ఆరోపణలు రాగా.... అతనిని లోపల విచారిస్తుంటే బయట ఎప్పటికీ నయంకాని జబ్బుతో బాధపడుతున్న అతని కొడుకు అతని కోసం వేచి ఉంటాడు. సినిమా అంతా మనకి పార్థిబన్ ఒక్కడే కనిపిస్తాడు మిగతా క్యారెక్టర్స్ వాయిస్ మాత్రమే మనకి వినిపిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విజేత… స్లమ్ డాగ్ మిలియనీర్  చిత్రానికి పనిచేసిన సౌండ్ డిజైనర్ రెసుల్ పూకుట్టి మరియు మాస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ పనిచేస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి భారతదేశ తారాగణమంతా పెద్ద స్థాయిలో తమ మద్దతు ప్రకటిస్తున్నారు. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, కమల్ హాసన్, శంకర్, అమీర్ ఖాన్, యశ్, మమ్ముట్టి ఇలా ఎంతో మంది అగ్ర తారాగణం పార్థిబన్ చేసిన ప్రయోగం ఆస్కార్ వరకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనను అభినందనలతో ముంచెత్తారు. ఇప్పటికే ఈ చిత్రం సింగపూర్ సౌత్ ఏషియన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఆగస్టు 30న స్క్రీనింగ్ జరుపుకుంది.

1 గంటా 45 నిమిషాల నిడివి ఉండే ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది. అందరూ కోరుకున్నట్టు ఇది పెద్ద విజయం సాధించి ఆస్కార్ అవార్డుకి కూడా నామినేట్ అయి పార్థిబన్ మరియు భారత దేశానికే గొప్ప పేరు తీసుకురావాలని కోరుకుందాం.


మరింత సమాచారం తెలుసుకోండి: