ప్రభాస్ పాన్ ఇండియా సినిమా సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ది గోట్ లైఫ్- ఆడు జీవితం. తెలుగులో ఇదే పేరుతో ఈ సినిమాని విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.బ్లేస్సి దర్శకత్వంలో ఈ సినిమాని విజువల్ రొమాన్స్ బ్యానర్ నిర్మించడం జరిగింది. ఈ సినిమాపై నమ్మకంతో పృథ్వీరాజ్ ముందు నుంచి బాగా ప్రమోట్ చేస్తూ వచ్చాడు. నేడు ఎన్నో అంచనాలతో విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.


ఇది నిజంగా జరిగిన కథ. నజీబ్ అనే వ్యక్తి జీవిత కథను కేరళలో నవలగా రాస్తే కొన్ని లక్షల కాపీలు అమ్ముడయ్యాయట. దీంతో ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసేందుకు చాలా స్టార్ హీరోలు ప్రయత్నం చేశారు. చివరికి  స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే సాహసం చేశారు. కథ  ఎన్నో వర్ణనలు, ఇంకెన్నో వనానాతీతమైన బాధలు, ప్రేక్షకులను ఒక ఊహ లోకంలోకి తీసుకువెళ్లే విధంగా ఉంటుంది.కానీ ఈ సినిమా తియ్యడం మాత్రం పెద్ద సాహసమే. అయితే ఆ సాహసాన్ని పృథ్వీరాజ్ చాలా ఈజీగా చేసినట్లు కనిపించినా అతని కష్టం ప్రతి ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది. చెప్పుకోవడానికి ఇది కథ కాదు వ్యధ అని సింపుల్గానే చెప్పేసినా ఆ వ్యధను ప్రేక్షకులకు చేర వేయడంలో పృథ్వీరాజ్ సక్సెస్ అయ్యాడని  చెప్పొచ్చు.


 అయితే ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకుండా కేవలం జరిగిన కథను కథగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకోవడం నిజంగా అభినందనీయం.ఈ సినిమా పృధ్వీరాజ్ వన్ మ్యాన్ షో. ఇతర నటీనటులు ఉన్నా సరే  మనం పృథ్వీరాజ్ ను మాత్రమే చూస్తూ ఉంటాం. ఆయన నటన మేకోవర్ తో ఆకట్టుకున్నాడు. ఖచ్చితంగా అవార్డులు వస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆఫ్రికన్ వ్యక్తిగా కనిపించిన హాలీవుడ్ నటుడు, హకీం పాత్రలో నటించిన గోకుల్ కూడా తమదైన శైలిలో బాగానే ఆకట్టుకున్నారు. అమలాపాల్ పాత్ర చిన్నది అయినా ఉన్నంతలో బాగా చేసింది.  సినిమాటోగ్రాఫర్  తన పనితనం చూపించాడు. రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశానికి బాగా సెట్ అయి సినిమాకి పెద్ద హైలైట్ అయింది. డైరెక్టర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నిడివి బాగా ఎక్కువ అనిపిస్తుంది ఆ విషయంలో కొంచెం కేర్ తీసుకుని ఉంటే బాగుండేది కానీ సినిమా లవర్స్ ని అయితే ఖచ్చితంగా ఈ సినిమా ఆకట్టుకుంటుంది.ఈ మూవీకి 4/5 రేటింగ్ ఇవ్వవొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: