తెలుగు సినిమా హాస్యనటుడు ఆలీ రాజకీయ ప్రవేశంపై ఈ మధ్య రసవత్తరమైన చర్చ సాగుతోంది. ఆలీ ఏ పార్టీలోకి వెళ్తాడన్నది పెద్ద పజిల్ గా మారిపోయింది. దానికి ఆయన త్రిపాత్రాభినయం చేయడమే ప్రధాన కార‌ణం. మైనారిటీ వర్గానికి చెందిన ఆలీకి సినిమా నటుడుగా మంచి క్రేజ్ ఉంది. ఆయన ఏ పార్టీలో చేరితే వారికి బాగానే ప్లస్ అవుతుందన్న అంచనాలు ఉండడంతో ఆలీ వైపే ఇపుడు అందరి కళ్ళూ పడుతున్నాయి.


మంత్రి గంటాతో భేటి :


విశాఖలో హఠాత్తుగా ప్రత్యక్షం అయిన ఆలీ మంత్రి గంటా శ్రీనివాసరావుని కలసి ఏకాంతంగా చర్చించడం ఆసక్తిని కలిగిస్తోంది. మంత్రి గంటా విజయానికి గతంలో ఆలీ ఎన్నికల ప్రచారం చేశారు. ఆ పరిచయాలతోనే  ఆలీ వచ్చారని అంటున్నా ఆయనకు టీడీపీలో టికెట్ కన్ ఫర్మ్ చేసుకోవడానికి గంటా స‌హాయం కూడా అడిగారని ప్రచారం సాగుతోంది. ఇక ఆలీ గుంటూరు నుంచి పోటీ చేయాలని ఉందని తన మనసులో మాటను మంత్రికి తెలియచేశారని అంటున్నారు. 

అదే విధంగా గెలిచిన తరువాత మైనారిటీ కోటాలో మంత్రి పదవి కూడా ఇవ్వాలని కండిషను కూడా పెట్టినట్లుగా చెబుతున్నారు. ఈ విషయాలను  టీడీపీ అధినేతకు వివరించాలని, తనకు టికెట్ వచ్చేలా చూడాలని ఆలీ గంటాను కోరినట్లుగా టాక్. ఇక తాను ఇరవయ్యేళ్ళ పాటు టీడీపీకి సేవ చేశానని తాను ఇపుడు తగిన ప్రాధాన్యత కోరడంతో తప్పు లేదని కూడా అలీ అంటున్నారని సమాచారం.


ముగ్గురితోనూ :


ఇక గడచిన కొద్ది కాలంలోనే ఆలీ ఏపీలో మూడు ప్రధాన పార్టీల అధినేతలను కలసి సంచలనం రేపారు. విమానంలో జగన్ని కలసి ముచ్చటించిన ఆలీ వైసీపీలో చేరుతారన్న చర్చకు తెర తీశారు. ఆ తరువాత ఆయన అమరావతిలో కనిపించి ముఖ్యమంత్రి చంద్రబాబుని కూడా కలసి మళ్ళీ షాక్ తినిపించారు. . అంతటితో ఊరుకోకుండా జనసేనాని పవన్ తోనూ మూడు గంటల పాటు సుదీర్ఘ భేటీ వేసి మరీ ఆలీ ఆ పార్టీలో చేరుతారా అన్న సందేహాన్ని కలిగించారు. కాగా తాను వైసీపీలో చేరడం లేదని మంత్రితో మాటల సందర్భంగా ఆలీ స్పష్టం చేశారని అంటున్నారు. మరి చూడాలి ఆలీ పయనం ఎటు వైపో


మరింత సమాచారం తెలుసుకోండి: