2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 151 సీట్లతో ఘన విజయం సాధించింది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కృషి చేసిన వారితో పాటు, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకుని మంత్రి మండలి ఏర్పాటు చేసింది. పార్టీ అభివృధ్ధి కోసం ఎంతో కృషి చేసిన ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి ఇస్తారని అందరూ భావించారు. కానీ రోజాకు సామాజిక సమీకరణల కారణంగా పదవి లభించకపోవటంతో ఏపీఐఐసీ చైర్మన్ గా రెండేళ్ళ పాటు కొనసాగేలా నామినేటెడ్ పదవి ఇచ్చారు. 
 
2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం పని చేసిన సినీ ప్రముఖులకు కూడా న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖుడైన థర్టీ ఇయర్స్ పృథ్వీకి ఎస్వీబీసి చైర్మన్ గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో నటుడైన అలీ గారికి కూడా ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర నాటక మండలి చైర్మన్ గా నియమించినట్లు తెలుస్తుంది. 
 
నటుడు అలీ మొదట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారితో, జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కల్యాణ్ గారితో చర్చలు జరిపి రాజమండ్రి నుండి ఎంపీ స్థానంలో పోటీ చేయాలని భావించారు. ఆ పార్టీలు టికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ రాష్ట్రంలో వైసీపీ పార్టీ వేవ్ బలంగా ఉండటంతో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా వైసీపీ పార్టీలో చేరాడు అలీ. వైసీపీ పార్టీ తరపున కొన్ని ప్రాంతాలలో పర్యటించి పార్టీ విజయం కోసం కృషి చేసాడు. 
 
వైసీపీ ప్రభుత్వం గతంలో అలీకి కీలక పదవి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తరువాత ఆ వార్తలు నిజం కాదని తెలిసింది. ఇప్పుడు మాత్రం నటుడు అలీని ఆంధ్ర ప్రదేశ్ చలన చిత్ర నాటక మండలి చైర్మన్ గా నియమించేసారని అధికారికంగా ప్రకటన మాత్రం రావాల్సి ఉందని సమాచారం. పృథ్వీ, అలీ ఇద్దరికీ కీలక పదవులు రావడంతో వైసీపీ పార్టీలో ఉన్న ఇతర సినీ ప్రముఖులు  త్వరలోనే వారికి కూడా పదవులు వస్తాయని ఆశిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: