శనివారం నుంచి సమ్మెకు పిలుపు ఇచ్చిన ఆర్టీసీ కార్మికులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను మీచేతులతో మీరే ముంచేసుకుంటారని అని మండిపడ్డారు. సంస్థకు ఆదాయం వచ్చే దసరా, దీపావళి ముందు సమ్మె చేసి సంస్థను నాశనం చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చల వివరాలను సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించడానికి ప్రభుత్వం సంసిద్దంగా ఉందనే విషయాన్ని తెలిపినప్పటికీ కార్మిక సంఘాల నాయకులు సమ్మె కొనసాగించడానికే నిర్ణయించుకున్నట్లు అధికారులు చెప్పారు.


ఆర్టీసీ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో, దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా వచ్చే ఆదాయం ఎంతో కొంత ఉపయోగపడుతుందని, ఈ సమయంలోనే ఆర్టీసీకి నష్టం తెచ్చే విధంగా యూనియన్లు సమ్మెకు పిలుపునివ్వడం పట్ల ప్రభుత్వం తన అసహనాన్ని వ్యక్తం చేసింది. ఆర్టీసీలో సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీన్ని ఉల్లంఘించి సమ్మె చేయడం చట్ట విరుద్దమని అధికారులు అభిప్రాయపడ్డారు.


చట్ట వ్యతిరేకంగా సమ్మె చేస్తే కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించే అధికారం సంస్థకు ఉందని చెప్పారు. ఆర్టీసీ సమ్మె విషయంలో అధికారులు చట్ట ప్రకారమే నడుచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శనివారం సాయంత్రం ఆరు గంటల లోగా విధుల్లో చేరిన వారిని మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, మిగతా వారిని తమంతట తాము ఉద్యోగాలు వదులుకున్న వారిగానే పరిగణించాలని ఆదేశించారు.


ఆర్టీసీ యూనియన్ నాయకుల ఉచ్చులో పడి, కార్మికులు సంస్థకు నష్టం చేయవద్దని, తమ ఉద్యోగాలు తామే పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సిఎం సూచించారు. కార్మికుల డిమాండ్లపై ఇకపై ఎలాంటి చర్చలు ఉండవని సిఎం స్పష్టం చేశారు. ఆర్టీసీని కాపాడడానికి ప్రభుత్వం ఎంతో చేసిందని, కానీ ఆర్టీసీ కార్మికులే ఆర్టీసీని ముంచే పని చేస్తున్నారని, ఈ పరిస్థితుల్లో ఆర్టీసీని కాపాడడం కష్టమని సిఎం అభిప్రాయపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: