ఆర్టీసీ సిబ్బంది విషయంలో కేసియార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కార్మికులు, ఉద్యోగుల విరమణ వయస్సును 58 నుండి 60 కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికులను ఇకనుండి ఉద్యోగులుగా పిలవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మహిళా ఉద్యోగులను రాత్రిళ్ళు విధుల నుండి మినహాయించాలని కూడా డిసైడ్ చేశారు.

 

కేసియార్ తీసుకున్న నిర్ణయాలన్నీ తక్షణమే అమల్లోకి వచ్చేట్లుగా ఆదేశాలున్నాయి. కాబట్టి ఇకనుండి ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేయనున్న వారందిరికీ 2 ఏళ్ళ సర్వీసు బోనస్ అనే చెప్పాలి.  సంస్ధలో మొత్తం మీద 43 వేలమంది ఉద్యోగులు, కార్మికులున్న విషయం అందరికీ తెలిసిందే.  మొన్న తమ డిమాండ్ల సాధన కోసం వేలాదిమంది దాదాపు 59 రోజులు నిరవధిక సమ్మె చేసిన చలించని కేసియార్ తర్వాత మాత్రం తనంతట తానుగానే వాళ్ళపై వరాల జల్లు కురిపిస్తున్నారు.

 

నిరవధిక సమ్మెలో సుమారు 30 మంది చనిపోయినా కేసియార్ చలించలేదు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా పట్టించుకోలేదు. కారణం ఏమిటంటే యూనియన్ నేతలు అశ్వద్ధామరెడ్డి లాంటి వాళ్ళు కేసియార్ ను నోటికొచ్చినట్లు తిట్టారు. అంతేకాకుండా కేసియార్ ఎవరినైతే బద్ధ శతృవులుగా చూస్తున్నారో వాళ్ళందరినీ కలుపుకుని సమ్మె చేయటమే పాపమైపోయింది.

 

చివరకు సమ్మె చేయలేక జీతాలు లేక పస్తులుండలేక మొత్తానికి ఉద్యోగులు, కార్మికులు కేసియార్ కు సరెండర్ అయిపోయిన తర్వాత కానీ వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. సరే తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కార్మికులను నేతలు తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలతో ఆర్టీసీలో కేసియార్ చివరకు యూనియన్లను కూడా రద్దు చేసేశారు. సరే ఏదేమైనా మొత్తానికి ఆర్టీసీ సిబ్బందికి మంచి రోజులొచ్చాయనే అనుకోవాలి.  అందుకనే సమ్మె రోజుల్లో కేసియార్ ను శాపనార్ధాలు పెట్టిన వాళ్ళే తర్వాత నుండి విపరీతంగా పొగుడుతున్నారు. ఇపుడు పై మూడు నిర్ణయాలతో  అందరూ మంచి ఖుషీగా ఉన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: