కరోనా ఈ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను వణికిస్తోంది. అన్ని రంగాలనూ కుంగదీస్తోంది. దీని ప్రభావానికి లోనుకాని రంగాలు అంటూ ఏమీ కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది జీవితాలను అతలాకుతలం చేసిందీ మహమ్మారి. ఇంకా దీన్ని అంతమొందించే వ్యాక్సీన్ ఇంకా రాలేదు. దాని కోసం ప్రపంచం ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఉన్నదల్లా దాని దూకుడుకు అడ్డకట్ట వేసే మందులే.

ఈ కరోనా ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైనా గణనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. ఒక దశలో ప్రభుత్వాలు రాబడి లేక ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు అసలు ఈ కరోనా ప్రభావం రాష్ట్రాలపై ఎంతగా వుందనే అంశంపై ఎస్‌బీఐ ఓ పరిశోధన నిర్వహించింది. దీని ఫలితాలు చూస్తే మనం నోరు వెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే.. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు ఐదు లక్షల కోట్ల మేరకు రెండు రాష్ట్రాలు స్థూల రాష్ట్ర ఉత్పత్తి నష్టపోతున్నట్లు తేలింది.


మొత్తం 24 రాష్ట్రాలపై ఎస్‌బీఐ పరిశోధన చేసింది. ఈ మొత్తం 24 రాష్ట్రాలు కరోనా కారణంగా  37,52,717 కోట్ల మేర జీఎస్‌డీపీని కోల్పోతున్నట్టు తేలిందట. ఇందులో 43.75% మొత్తం పట్టణ ప్రాంతాల్లో నష్టపోతుండగా..  56.25% గ్రామీణ ప్రాంతాల్లో నష్టం జరిగే అవకాశం ఉందట. అంటే కరోనాతో పట్టణాల కంటే పల్లెలే ఎక్కువగా నష్టపోతున్నాయన్నమాట.

ఇక ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌ నష్టం వాటా రూ.2,53,925 కోట్లు, తెలంగాణ నష్టం వాటా రూ.2,53,512 కోట్లుగా ఎస్‌బీఐ అంచనా వేసింది. అంటే రెండు రాష్ట్రాలు కలిసి దాదాపు 5 లక్షల కోట్లు కరోనా కారణంగా నష్టపోయాయన్నమాట. ఇంతకీ జీఎస్‌డీపీ అంటే ఏంటో చెప్పలేదు కదా.. వివిధ రంగాల ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో వచ్చే మొత్తం విలువనే ఈ జీఎస్‌డీపీ లేదా  స్థూల రాష్ట్ర ఉత్పత్తి అంటారు. వ్యవసాయం, పరిశ్రమ, సేవా రంగాలను ఈ లెక్కల కోసం ప్రామాణికంగా తీసుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: