ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి హత్యకేసు సుప్రీంకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.  నిర్భయ తరపున వాదించిన లాయర్ సీమా కుష్వాహ ...సుగాలి ప్రీతి కేసుపై  పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించారు. సీబీఐ దర్యాప్తు జరపాలనేది ఆమె డిమాండ్‌.

కర్నూలు జిల్లాకు చెందిన సుగాలి ప్రీతి కేసు అప్పట్లో రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇప్పటికి ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోలేదు. దీంతో ఈ కేసులో సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు సుగాలి ప్రీతి కుటుంబసభ్యులు. దీని కోసం నిర్భయ కేసులో వాదనలు వినిపించిన న్యాయవాది సీమా కుష్వాహను కలిశారు. ఈ కేసులో ఏపీ పోలీసులు తమకు  అన్యాయం చేశారని ఆమె దృష్టికి తీసుకెళ్లారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.

గత కొద్ది రోజులుగా తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. అత్యాచారం, హత్యపై సీబీఐ విచారణ చేయాలంటూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద  కుటుంబ సభ్యులు దీక్షకు కూర్చున్నారు.  ఇప్పటికే ఢిల్లీలోని పలువురు నాయకుల్ని కలిసి తమ గోడు చెప్పుకున్నారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు.  

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలలకు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇప్పటి వరకు సీబీఐ కేసును పట్టించుకోవడం లేదు. దీంతో నిర్భయ లాయర్‌ సీమాని కలిశారు సుగాలి ప్రీతి తల్లిదండ్రులు. న్యాయం చేయాలని సీమాను కోరారు. దీనిపై స్పందించిన సీమా.. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. నవంబర్ 2వ తేదీ తర్వాత సుగాలి ప్రీతి కేసుపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.

మొత్తానికి సుగాలీ ప్రీతీ హత్యకేసు ఢిల్లీకి చేరింది. సుప్రీం కోర్టులో ఈ కేసుపై వాదనలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నిర్భయ తరఫున వాదనలు గట్టిగా వినిపించినా సీమా కుష్వాహా.. సుగాలీ ప్రీతి కేసులో పిటిషన్ దాఖలు చేస్తామని ప్రకటించడంతో ఇపుడు అందరి దృష్టి ఆ కేసుపై మళ్లింది.




మరింత సమాచారం తెలుసుకోండి: