యూరప్‌లో 14 దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తోంది. గత కొన్ని రోజులుగా కేసులు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే డబ్ల్యూహెచ్ ఓ యూరప్ దేశాలకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయా దేశాలకు సూచించింది.
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే చోట్ల పరీక్షలు భారీగా పెంచాలని సూచించింది. క్వారంటైన్ కంటే ఇలాంటి చర్యలపైనే ప్రధానంగా దృష్టి సారించాలని తెలిపింది. గ్రీక్‌లో కూడా నెల రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించారు. ఏథెన్స్ సహా ప్రధాన నగరాల్లో కఠిన నియమాలు అమల్లో ఉంటాయని ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. బెల్జియం కూడా కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ విధించింది.
ఆస్ట్రియా రాత్రి పూట పూర్తిగా కర్ఫ్యూ విధించింది. అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు నిలిచిపోతాయని ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతుండటంలో ప్రభుత్వాలు కఠిన నిబంధనలు విధించడంతో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. బార్సిలోనా, ఫ్రాన్స్, యూకేల్లో ప్రజలు ఆందోళనలు నిర్వహించారు.
రెస్టారెంట్లు, అత్యవసరాలు మినహా మిగతా వ్యాపార సంస్థలన్నీ మూసివేయనున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే, తప్పనిసరిగా సంబంధిత అధికారుల నుంచి రాతపూర్వక అనుమతులు తీసుకోవాలి. వ్యాపార వర్గాలను ఆదుకునేందుకు అదనపు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ లాక్‌డౌన్ విధించిన రెండు వారాల్లో మహమ్మారి వ్యాప్తి తగ్గినట్లయితే మరిన్ని సడలింపులు కల్పిస్తామని దేశాధినేతలు తెలిపారు.
ఫ్రాన్స్‌లో ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీంతో ఫ్రాన్స్
రాజధాని పారిస్‌లో లక్షలాది మంది జనం సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పారిస్ చుట్టూ 700 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఫస్ట్ లాక్‌డౌన్‌లో కోవిడ్ యూరప్‌పై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని చూపించింది. సెకండ్ వేవ్‌లోనూ కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.కరోనాను లైట్ తీసుకోని యూరప్ దేశాలు ఫలితం అనుభవిస్తున్నాయ్.