కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం పాతబస్తీకి చేరుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. గ్రేటర్‌ ఎన్నికలను పురస్కరించుకుని అమిత్‌ షా నగరానికి వస్తున్న సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు బ్రహ్మరథం పట్టడం కోసం ఉదయం నుంచే వేచి ఉన్నారు. పర్యటనలో భాగంగా చార్మినార్‌ భాగ్యలక్ష్మీ దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనుండటంతో నగరంలోని అన్ని ప్రాంతాలకు చెందిన నాయకులు ఆదివారం ఉదయం నుంచే పెద్ద ఎత్తున చార్మినార్‌కు చేరుకున్నారు.

జై శ్రీరాం.. జై జై శ్రీరాం.. రామ్‌.. లక్ష్మణ్‌.. జానకీ.. జై భోలో హనుమాన్‌ కీ.. అంటూ నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. భాగ్యలక్ష్మీ దేవాలయంలో పాటు చార్మినార్‌ నలువైపుల కాషాయం జెండాలను పట్టుకుని కార్యకర్తలు నినాదాలు చేశారు.
అమిత్‌ షా పర్యటన సందర్భంగా కేంద్రం అదనపు బలగాలు చార్మినార్, మక్కా మసీదు, లాడ్‌బజార్, గుల్జార్‌హౌజ్, చార్‌కమాన్, కాలికమాన్, ఘాన్సీబజార్, సర్ధార్‌ మహల్‌ రోడ్డు తదితర ప్రాంతాలన్నింటిని తమ అధీనంలోకి తీసుకుని బందోబస్తు నిర్వహించారు.

పాతబస్తీలోని డివిజన్ల నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థులందరూ పార్టీ జెండాలను పట్టుకుని చార్మినార్‌ వద్ద ప్రదర్శన నిర్వహించారు. మధ్యాహ్నం 12.12 గంటలకు అమిత్‌షా కారులో చార్మినార్‌కు చేరుకున్నారు. కారు దిగిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అభివాదం చేశారు. దీంతో కార్యకర్తలు అమిత్‌షా జిందాబాద్‌.. బీజేపీ జిందాబాద్‌.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆయన భాగ్యలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు.
 
ఎమ్మెల్యే రాజాసింగ్, డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ నగర మాజీ ఉపాధ్యక్షుడు ఉమామహేంద్ర తదితరులు ఆయన వెంబడి ఉండి పూజలు చేయించారు. చార్మినార్‌ పరిసరాల్లో దక్షిణ మండలం పోలీసులు అదనపు బలగాలతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అమిత్‌ షా పర్యటన తమ పార్టీలో మరింత ఉత్సాహాన్ని నింపిందని నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. నగరంలో బీజేపీ హవా కనిపిస్తోందని పలువురు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: