గత పది నెలలుగా దేశవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద సమస్య కరోనా వైరస్దీని కారణంగా అన్ని రంగాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి కష్టకాలంలోనూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత కొన్ని నెలలుగా విధించిన లాక్ డౌన్ల కారణంగా నిలిచిపోయిన జీతాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను తిరిగి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు 2020 మార్చి, ఏప్రిల్ నెలల్లో వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను డిసెంబర్‌ నెలలో తిరిగి మరలా చెల్లించేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.




ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు తక్షణమే తగిన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఏప్రిల్‌ నెలలో తగ్గించిన వేతనాలను ఈ నెలతో పాటు వచ్చే నెల 2021 జనవరిలో రెండు విడతలుగా చెల్లించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం వల్ల విధించిన లాక్ డౌన్ల కారణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగుల జీతాలు 50 శాతం తగ్గించి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వ చర్యను ఏపీ హైకోర్టు తప్పుపట్టింది. వెంటనే 12 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని ఆదేశించిన సంగతి కూడా తెలిసిందే. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా, హైకోర్టు ఉత్తర్వులపై ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరట లభించినట్లు అయింది. ఈ తరుణంలో జగన్ ప్రభుత్వం ఉద్యోగులకు నిలిపివేసిన జీతాలు తిరిగి చెల్లించాలని నిర్ణయించడం విశేషం. దీనిపై పలువురు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: