ఒక‌ప్పుడు కాసుల‌తో గ‌లగ‌ల‌లాడిన బ‌ల్దియా ఖ‌జానా.. కాలం గడుస్తున్న కొద్దీ వెలవెలబోతోంది. జీహెచ్ఎంసీకి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మ‌రో వైపు ప‌న్నుల వ‌సూళ్లు తగ్గిపోయాయి. దీంతో బల్దియా ఎన్నడూ లేని విధంగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

జీహెచ్ఎంసీ బడ్జెట్ రోజురోజుకూ దిగజారిపోతోంది. బ‌ల్దియాకు క‌ష్టాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న బల్దియా ఖజానాపై వరదలు, ఎన్నికలు మరింత భారాన్ని మోపాయి. గత రెండు నెలల క్రితంవరకు అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో.. నెలనెలా రావాల్సిన పన్నులు వసూలు కాలేదు. ప్రతి నెలా మొదటి తేదీనే చెల్లించాల్సిన జీతాలు..  గత రెండు నెలలుగా ఆలస్యం అవుతున్నాయి.

వరుసగా కరోనా, ధరణి, వరదలు, ఎన్నికలు గ్రేటర్ కార్పొరేషన్‌ను ఆర్థిక కష్టాల ఊబిలో ముంచేశాయి. అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధులతో బిజీగా గడిపిన అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించలేకపోయారు. ఒక వైపు జీతాలను ఇవ్వలేక.. మెయింటెనెన్స్ వెళ్లదీయలేక బల్దియాలో పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఒకటో తేదీ దాటినా జీతాలు వస్తాయనే నమ్మకం కార్మికుల్లో లేకుండా పోయింది. జీతాలు, పెన్షన్లు, మెయింటెనెన్స్ కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. తగ్గిపోతున్న ఆదాయ వనరులతో అధికారులు తలలు పట్టకుంటున్నారు.

సాధారణంగా ప్రతి నెలా ఆస్తిపన్ను 60 కోట్లకుపైగా వసూలు కావాల్సి ఉంటుంది. అయినా గతంలో మాదిరిగా పన్ను చెల్లింపులు జరగడం లేదని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ముందు ప్రభుత్వం ప్రకటించిన ట్యాక్స్ రాయితీ ఎఫెక్ట్ బల్దియాపై బాగానే పడింది.

నిధులు ఈస్థాయిలో తగ్గిపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. జీహెచ్ఎంసీలో అనేక విభాగాలు ప్రైవేటుపరం చేయడంతో ఆ సంస్థలకు గతంలో కంటే ప్రస్తుతం బిల్లులు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. ఇక ఎన్ఫోర్స్‌మెంట్‌లో ఓ ఉన్నతాధికారి తన కార్యాలయానికి, తన మెయింటెన్స్‌ కోసం ప్రతీ నెల లక్షల్లో బిల్లులు పెట్టుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ అయిన అధికారులకు జీహెచ్‌ఎంసీలో ప్రధాన శాఖలు కేటాయించి అనవసరంగా లక్షల్లో జీతాలను చెల్లిస్తున్నారే ఆరోపణలు ఉన్నాయి. పన్నుల వసూలు చేసుకోండి.. జీతాలు తీసుకోండి అనే బల్దియా అధికారుల ప్రకటనతో ప్రస్తుతం అప్పుల ఊబిలో ఉన్న జీహెచ్‌ఎంసీ.. సర్కార్ సహాయం కోసం ఎదురుచూస్తుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే త్వరలోనే సమ్మెకు దిగుతామని జీహెచ్ఎంసీ ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: