నీళ్ల కోసం ఒకప్పుడు తండ్లాడిన తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలు ఫలిస్తున్నాయా.. ప్రాజెక్టుల్లో జలకళతో తెలంగాణలో ధాన్యరాశులు పోగుపడుతున్నాయా అంటే అవుననే అనిపిస్తోంది. ధాన్యం దిగుబడి, కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అంచనాలకు మించి ఈ ఏడాది ధాన్యం దిగుబడి సాధంచి కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ ఏడాది ప్రభుత్వమే ఏకంగా కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసింది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. రాష్ట్ర విభజన నాటితో పోలిస్తే తెలంగాణలో ధాన్యం కొనుగోలు ఏకంగా ఐదు రెట్లు దాటింది. ఏడేళ్లకాలంలో తెలంగాణలో కొనుగోళ్లలో 576 శాతం పెరుగుదల కనిపించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒకసారి తెలంగాణలో పంట దిగుబడుల లెక్కలు తిరగేస్తే.. 2014-15లో వానాకాలం, యాసంగి రెండు పంటలు కలిపి 35 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. అదే ఈ ఏడాది కోటి 6 లక్షల ఎకరాల్లో వరి పండించారు. 2014-15 ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి 24.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు.

ఈ ఏడాది ఏకంగా కోటి 40 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఒక్క యాసంగిలోనే 2014-15లో 13.24 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే.. ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నది ప్రభుత్వం.  అంటే  కొనుగోళ్లలో 587 శాతం పెరుగుదల నమోదైంది. వ్యవసాయ శాఖ, జిల్లా అధికారుల నుంచి వచ్చిన నివేదికల ప్రకారం 70 నుంచి 80 లక్షల మెట్రిక్ టన్నులు అంచనాగా అనుకున్నారు. కానీ.. కేసీఆర్ ఆదేశాలతో అదనంగా వచ్చిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది.

గత ఏడాది ఎఫ్‌సీఐ సేకరించిన ధాన్యంలో సగం ఒక్క తెలంగాణ నుంచే అని ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో తెలంగాణలో ధాన్య రాశులు కళకళలాడుతున్నాయి.  పంటపండటం ఒక ఎత్తైతే దాన్ని కొనడం కూడా మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: