చంద్రబాబు హయాంలో రియల్ టైమ్ గవర్నెన్స్ అంటూ ఎప్పటికప్పుడు అధికారులతో నివేదికలు తెప్పించుకోవడం, వాటిపై సమీక్షలు జరపడం, వార్ రూమ్ లు ఏర్పాటు చేయడం వంటి హడావిడి పనులు బాగానే జరిగేవి. అయితే జగన్ వచ్చిన తర్వాత అలాంటి కార్యక్రమాలు కొంతవరకు తగ్గాయి. సచివాలయాల ఏర్పాటుతో.. ప్రభుత్వమే ప్రజల దగ్గరకు వచ్చిందన్న భావన కలిగింది. ఇక్కడ కూడా కొన్ని లోటుపాట్లు లేకపోలేదు. అందుకే సచివాలయాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ, నిత్యం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని తనిఖీ చేసే బాధ్యత జిల్లా అధికార యంత్రాంగంపై పెట్టింది.

జిల్లాలకు ముగ్గురు జాయింట్ కలెక్టర్లను పెట్టి పని విభజన చేసినా కూడా సచివాలయాల తనిఖీ వ్యవహారాన్ని మాత్రం అందరికీ అప్పగించారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు.. ఇలా అందరూ గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేయాల్సిందే. వారంలో కొన్నిరోజులు ఈ తనిఖీలు తప్పనిసరి. ఇప్పుడీ తనిఖీల వ్యవహారం నత్తనడకన సాగుతోందని సీఎం జగన్ అధికారులకు మెమోలు జారీ చేస్తున్నారు. ఇకపై ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ తనిఖీలతో అసలు పని ముందుకు సాగడంలేదనే వారు కూడా ఉన్నారు.

సచివాలయాల పనితీరు భేష్ అని చెప్పుకుంటున్న సందర్భంలో మళ్లీ ఈ తనిఖీలెందుకని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. ప్రతి రోజూ స్పందన పేరుతో ప్రజలనుంచి సమస్యల అర్జీలు తీసుకుని, వాటిని ఫాలో అప్ చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హయాంలో గ్రీవెన్స్ డే లు జరిగేవి, ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక పేరు మార్చి స్పందన అంటున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా ప్రజల సమస్యలు మాత్రం అక్కడే ఉంటున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చాక కరోనా కాలం వల్ల కొన్నిరోజులు ఈ కార్యక్రమం వాయిదా పడినా, ఇప్పుడు మళ్లీ మొదలైంది. అయితే తూతూమంత్రంగా ఈ స్పందన చేపడుతున్నారా లేక సమస్యలు నిజంగా పరిష్కారం అవుతున్నాయా అనేది ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన సందర్భం.

అప్పుడప్పుడూ సడన్ గా తనిఖీలు చేస్తే దానికి ప్రయోజనం ఉంటుంది కానీ, తనిఖీలను కూడా రోజువారీ పనిగా చేస్తే సమయం సరిపోదని అంటున్నారు కొంతమంది అధికారులు. దీనిపై ఎవరూ ఎక్కడా బయటపడలేదు కానీ, తమలో తామే మథనపడుతున్నారు. పనిచేయాలా? తనిఖీలు చేయాలా అని ప్రశ్నిస్తున్నారు. పనిచేయకపోతే మెమోలు ఇవ్వాలని, తనిఖీలు చేయకపోయినా మెమోలు ఇస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: