ఏపీ శాసనసభ ఎన్నికలు ఈసారి చాలా రసవత్తరంగా మారాయి. ఇటు అధికార వైసీపీకి, అటు విపక్ష టీడీపీ కూటమికి ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. అందువలన 2 పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలోనే గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అయితే ఈసారి ఎన్నికల్లో వందకోట్లకు పైబడిన కోటీశ్వరులు అనేక మంది బరిలో ఉన్నారని మీకు తెలుసా? అవును, అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా శతకోటీశ్వరులు ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు.

లోక్ సభ నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థుల లిస్ట్ చూస్తే ఎవ్వరికీ అందనంత ఎత్తులో టీడీపీ లీడర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారని చాలా స్పష్టంగా తెలుస్తోంది. పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో తనకు రూ.5,785 కోట్ల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఆ తర్వాత స్థానంలోనూ మరలా టీడీపీ అభ్యర్థే లిస్టులో ఉండడం కొసమెరుపు. నెల్లూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూ. 716.31 కోట్లతో రెండో ప్లేసులో ఉన్నారు. ఇక 3వ స్థానంలో కూడా కూటమి అభ్యర్థే ఉండటం విశేషం. అనకాపల్లి లోక్ సభ నియోజవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న సీఎం రమేష్.. తనకు రూ. 497.59 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.

చిత్రంగా, ఆ తర్వాతి స్థానంలో నంద్యాల లోక్ సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డి రూ.147.74 కోట్ల విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. అదేవిధంగా మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ రూ.138.41 కోట్లతో ఏడోస్థానంలోను, అదే నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థి బాలశౌరి రూ. 133.71 కోట్లతో ఎనిమిదో స్థానంలో ఉన్నారు. ఇక తొమ్మిదో స్థానంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఉన్నారు. కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేస్తున్న షర్మిల.. తనకు రూ. 132 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనడం కొసమెరుపు.

1. పెమ్మసాని చంద్రశేఖర్ (టీడీపీ-గుంటూరు) -    రూ.5,785 కోట్లు
2. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (టీడీపీ-నెల్లూరు) - రూ. 716.31 కోట్లు
3. సీఎం రమేష్ (బీజేపీ-అనకాపల్లి) - రూ. 497.59 కోట్లు
4. శ్రీభరత్    (టీడీపీ-విశాఖపట్నం) - రూ.393.41 కోట్లు
5. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి    (వైసీపీ-రాజంపేట) - రూ.209.53 కోట్లు
6. పోచా బ్రహ్మానందరెడ్డి    (వైసీపీ-నంద్యాల) - రూ.147.74 కోట్లు
7. సింహాద్రి చంద్రశేఖర్    (వైసీపీ-మచిలీపట్నం) - రూ.138.41 కోట్లు
8. వి. బాలశౌరి (జనసేన-మచిలీపట్నం) - రూ. 133.71 కోట్లు
9. వైఎస్ షర్మిల (కాంగ్రెస్-కడప) - రూ.132 కోట్లు.


మరింత సమాచారం తెలుసుకోండి:

mps