- కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించిన అధ్యక్షుడు ఎర్నేని
- విభేదిస్తున్న సభ్యులు
- సంఘం అభివృద్ధికి కృషిచేసిన నామాకే మద్దతు  ఇవ్వాలంటూ పలువురి డిమాండ్‌
- సోషల్ మీడియా వేదికగా ఇరు వ‌ర్గాల‌ వార్

( ఖ‌మ్మం - ఇండియా హెరాల్డ్ )
 
పార్లమెంటు ఎన్నికలు ఖమ్మం కమ్మ మహాజన సంఘ పాలకవర్గంలో చిచ్చు రేపాయి. తొలుత బిఆర్ఎస్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం అధికంగా ఉన్న నియోజకవర్గమైనందున కాంగ్రెస్ కూడా కమ్మ సామాజిక వర్గ నేతకే అభ్యర్థిత్వం ఇవ్వాలని డిమాండ్ వినిపించింది. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన  ప్రముఖ వ్యాపారి వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ (వీవీసీ రాజా), మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ కూడా అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేశారు. ఓ దశలో నిజామాబాద్ జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గం నేత మండవ వెంకటేశ్వరరావుని కూడా ఖమ్మం నుంచి పోటీ చేయిస్తారని ప్రచారం జరిగింది.  


కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అనూహ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు అయిన  రామసహాయం రఘురాం రెడ్డిని ప్రకటించింది. ఆయ‌న వరంగ‌ల్ జిల్లా డోర్న‌క‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వారు. అయితే ఏపీలో చంద్రబాబు అరెస్టు సమయంలో నాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ వ్యవహార శైలి, కేటీఆర్ వ్యాఖ్యానించిన తీరును జీర్ణించుకోలేకపోయిన కమ్మ సామాజిక వర్గం ప్రజలు అత్యధిక శాతం మంది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అలాగే చంద్రబాబు కు శిష్యుడుగా పేరు ఉన్న రేవంత్ రెడ్డి సీఎం అవుతాడన్న కారణంతో ఆయనకు మద్దతుగా నిలిచారు. ఖమ్మం జిల్లాలో అయితే తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరికతో 90 శాతం మంది కమ్మ సామాజిక వర్గ ప్రజలు కాంగ్రెస్ కి జై కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో టిడిపి కేడర్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గుచూపింది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయభావుటా ఎగురవేసింది.


తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తదితర నేతలంతా భారీ మెజార్టీలతో విజయం సాధించారు.  ఆ సమయంలో..  తమ విజయంలో టిడిపి నేతలు, కార్యకర్తలు తమకంటే కష్టపడి పని చేశారని కితాబు ఇచ్చారు. అలా టిడిపి శ్రేణులు..  ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్‌కు చాలా దగ్గరయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానానికి బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ కూడా కమ్మ సామాజిక వర్గ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. కానీ రఘురామిరెడ్డికి అభ్యర్థిత్వం ఇవ్వడంతో కమ్మ సామాజిక వర్గం కొంత అసంతృప్తికి గురైంది. కాంగ్రెస్ విజయం కోసం ఖమ్మంలోని కమ్మవారంతా కలిసికట్టుగా పనిచేశామని, తమ కృషిని గుర్తించకుండా, నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న తమ సామాజిక వర్గం వారిని కాదని రెడ్డి సామాజిక వర్గం వారికి సీటు ఇవ్వడం పట్ల కింద ఆగ్రహంగానే ఉన్నారు.


ఈ విషయంలో రేవంత్ రెడ్డి తీరును కూడా తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకే మద్దతు ఇవ్వాలంటూ పలువురు పోస్టులు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది. ఇంతలోనే శుక్రవారం ఖమ్మం కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు పేరుతో వచ్చిన ఓ ప్రకటన తీవ్ర దుమారం రేపింది.  కమ్మ మహాజన సంఘం మద్దతు కాంగ్రెస్ అభ్యర్థికే ఉంటుందని కమ్మ మహాజన సంఘం అధ్యక్షుడు ఎర్నేని రామారావు విలేకరుల సమావేశంలో ప్రకటించడం మరో చర్చకు దారి తీసింది. దీంతో అప్పటివరకు కేవలం కమ్మ సామాజిక వర్గంలోని కొందరు వ్యక్తుల మధ్య జరుగుతున్న చర్చ కాస్త మహాజన సంఘ పాలకవర్గంలో చిచ్చు రేపింది. పలువురు ఈసీ మెంబర్లు అసలు అధ్యక్షుడు ఇచ్చిన ప్రకటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని, తమకు సమాచారం లేకుండా ఇద్దరు ముగ్గురు వ్యక్తులతో కలిసి అధ్యక్షుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారని, తాము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అదే సోషల్ మీడియా సాక్షిగా ప్రకటించారు.


ఈ వ్యవహారం అంతా ఇలా ఉంటే చివరకు కమ్మ సామాజిక వర్గ ఓట్లు ఎవరికి లాభిస్తాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు సహకారంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన నామ నాగేశ్వరరావు అటు తెలుగుదేశంలోనూ  ఇటు బిఆర్ఎస్ లోనూ కీలక పదవులు చేపట్టారు. ఆయన టిడిపిని వీడినప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు విషయంలో ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకపోవడం, నారా , నందమూరి కుటుంబాలతో సత్సంబంధాలు కొనసాగించడం, పైగా నందమూరి నటసింహం బాలకృష్ణ చైర్మన్గా ఉన్న బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి బోర్డు సభ్యుడుగా కూడా ఉండటం నామ నాగేశ్వరరావుకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. అంతేకాదు ఖమ్మంలో కమ్మ మహాజన సంఘం ఆవిర్భావం నాటి నుంచి సంఘ అభ్యున్నతికి, ఆర్థిక అభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రస్తుతం ఖమ్మం మహాజన సంఘ సభ్యులు గుర్తు చేసుకుంటున్నారు.


సంఘానికి తోడ్పాటు అందించినటువంటి నామా నాగేశ్వరరావుని కాదని వేరే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి మద్దతు ఎలా ప్రకటిస్తారంటూ అధ్యక్షుడు ఎర్నేని రామారావుకు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా,  రేణుకా చౌదరి లాంటి సీనియర్ నేత రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న నేపథ్యంలో.. రాజకీయాలు వేరు సామాజిక సమీకరణాలు వేరని, ఎవరు ఎవరికైనా మద్దతు ఇవ్వొచ్చని, కానీ ఒక సంఘం తరఫున అధ్యక్షుడి హోదాలో ఇలా ప్రకటన చేయడం సమంజసం కాదని పేర్కొంటున్నారు. ఇక టీడీపీ కేడర్ విషయానికొస్తే తెలంగాణలో తమ పార్టీ మద్దతు విషయమై అధినాయకత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు లేని క్రమంలో ఆత్మ ప్రబోధానుసారం ఓటు హక్కును వినియోగించుకోవాలని టిడిపి కేడర్ భావిస్తుంది. ఇన్ని పరిణామాల నేపథ్యంలో ఖమ్మం పార్లమెంటు రాజకీయాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ మరింత వేడిని పెంచుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: