విభజన చట్టంలో ఏపీకి దక్కింది ఏమైనా ఉందా అంటే అది పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా మాత్రమే. జాతీయ హోదా ప్రాజెక్టులు 30, 40  ఏళ్లుగా కడుతూనే ఉన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ పోలవరం అలా కాకూడదన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభించింది. డిజైన్లు, అనుమతి దగ్గర నుంచి అన్ని అంశాలను పరిష్కరించుకుంటూ ప్రాజెక్టు కు ఓ రూపాన్ని తెచ్చింది అప్పటి టీడీపీ ప్రభుత్వం.


సుమారు 72  శాతం వరకు చంద్రబాబు హయాంలో ప్రాజెక్టు పూర్తైంది. దీనికి కారణం చంద్రబాబు అప్పటి ఎన్డీయే కూటమిలో ఉండటం. కేంద్రం కూడా దీనికి సరిపడా నిధులు కేటాయించడం వంటివి చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పాలన పగ్గాలు చేపట్టిన సీఎం జగన్ పోలవరం నిర్మాణంలో అలసత్వం వహించారని అందుకే.. నేటికి ప్రాజెక్టు పూర్తి కాలేదని టీడీపీ నేతలు విమర్శించడం ఇప్పటి వరకు మనం చూశాం.


అయితే తాజాగా కేంద్రం సైతం పోలవరం ప్రాజెక్టును జగన్ పూర్తి చేయలేకపోయారని విమర్శించింది. ఇంత వరకు బాగానే ఉన్నా దీనిని పూర్తి చేయాల్సిన వారే విమర్శించడం ఇక్కడ కొసమెరుపు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ బీజేపీ నేతలు జగన్ పై ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. ఒకవేళ వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడితే దీనిని వెంటనే కేంద్రం తన ఆధీనంలోకి తీసుకొని ప్రాజెక్టును పూర్తి చేయాల్సింది.


కానీ అలా చేయలేదు. పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిన పోలవరం ప్రాజెక్టు పదేళ్లయినా పూర్తి కాలేదంటే దీనికి కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వం వైఫల్యంగా పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఐదేళ్ల పాటు వైసీపీ  ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకొని ఆ తర్వాత టీడీపీని కూటమిలోకి చేర్చుకొని ఇప్పుడు వైసీపీని విమర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పూర్తి చేయాల్సిన వారే.. ప్రశ్నిస్తుంటే దీనికి వైసీపీ మాత్రం ఏం సమాధానం చెబుతుందని విశ్లేషిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: