మాడుగుల నియోజకవర్గం పరిస్థితి విషయానికి వస్తే.. ఇక్కడ ఒకసారి విజయం సాధించి ఎమ్మెల్యే అయినవారు మరుసటి ఎన్నికల్లో ఓడిపోతే మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. తిరిగి ఆ స్థానాన్ని అందుకోలేకపోతున్నారు.చీడికాడ మండలానికి చెందిన రెడ్డి సత్యనారాయణ మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏకంగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌, మంత్రిగా పనిచేశారు. అలాగే దేవరాపల్లి మండలం తారువ గ్రామానికి చెందిన బూడి ముత్యాలనాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై విప్‌గా, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1955 ఎన్నికల్లో వడ్డాదికి చెందిన దొండా శ్రీరామ్మూర్తి తన సమీప ప్రత్యర్థి తెన్నేటి విశ్వనాథంపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 1962 ఎన్నికల్లో తెన్నేటి విశ్వనాథం చేతిలో దొండా శ్రీరామ్మూర్తి ఓటమిని చూశారు. 1967 వ సంవత్సరంలో మాడుగుల మహారాణి రమాకుమారిదేవి గెలుపొందగా, 1972లో బొడ్డు కళావతి అదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 1978లో కురచా రామునాయుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి గుమ్మాల ఆదినారాయణపై విజయం సాధించారు.


ఆ తరువాత 1985, 89 ఎన్నికల్లో పోటీ చేసిన కురచా రామునాయుడు రెండుసార్లు రెడ్డి సత్యనారాయణ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తరువాత ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు.1983, 85, 89, 94, 99 ఎన్నికల్లో పోటీ చేసిన రెడ్డి సత్యనారాయణ తన ప్రత్యర్థులపై విజయం సాధించారు. ఆయన రాష్ట్ర మంత్రిగాను పనిచేశారు. అయితే 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కరణం ధర్మశ్రీ చేతిలో రెడ్డి సత్యనారాయణ ఓడిపోయారు. ఆ తరువాత ఎన్నికల్లో ఆయనకు ఎక్కడా పోటీ చేసేందుకు ఛాన్స్ రాలేదు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసిన గవిరెడ్డి రామానాయుడు ప్రత్యర్థి అవుగడ్డ రామ్మూర్తినాయుడుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అయితే 2014, 2019 ఎన్నికల్లో రామానాయుడు పోటీ చేసినా వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు చేతిలో ఓడిపోయారు.ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ టికెట్‌ కోసం రామానాయుడు ఎంత ప్రయత్నించినా దక్కలేదు. అంటే ఈ నియోజకవర్గంలో  ఒకసారి ఓడిపోయిన తరువాత మళ్లీ ఎమ్మెల్యేలుగా గెలుపొందలేకపోయారు. మాడుగుల నియోజకవర్గంలో ఇదొక సెంటిమెంట్‌గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: