ఏపీలో సీఎం జగన్ ను ఎదుర్కొనేందుకు చంద్రబాబు ఎన్డీయే కూటమిలోకి చేరిపోయారు.  రెండు రోజుల క్రితం మ్యానిఫెస్టోని సైతం విడుదల చేశారు. అయితే ఇందులో కూటమి భాగస్వామ్య పార్టీ బీజేపీ ప్రస్తావన ఎక్కడా రాకపోవడం సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది.  పేరుకే మూడు పార్టీలు కూటమి కాగా.. మ్యానిఫెస్టో మాత్రం టీడీపీ, జనసేనదే.


ఇందులో ఎక్కడా కూడా బీజేపీ మార్క్ కనిపించలేదు. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టోలో  మోదీ ఫొటో కానీ.. బీజేపీ కమలం గుర్తు కానీ లేదు. కేవలం చంద్రబాబు, పవన్ ల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. మ్యానిఫెస్టో విడుదల చేసే సమయంలో దిల్లీ నుంచి బీజేపీ నేత సిద్ధార్థ నాథ్ సింగ్ వచ్చారు. ఈ ముగ్గురు నిలబడి ఫొటోలకు పోజులిచ్చి మ్యానిఫెస్టోని విడుదలద చేశారు. కానీ ఈ సమయంలో దీని ప్రతిని పట్టుకునేందుకు కూడా సిద్ధార్థ్ ఆసక్తి చూపలేదు.


అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి జాతీయ స్థాయిలో ప్రత్యేక మ్యానిఫెస్టో ఉందని చెప్పడం విశేషం. అదే రాష్ట్రంలో ప్రచురించామన్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన ప్రకటించిన మ్యానిఫెస్టోతో తమకు ఎలాంటి సంబధం లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే అసలు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు ఎవరూ కూడా రాకపోవడం గమనార్హం. దీంతో ఇది చంద్రబాబు, పవన్ పొత్తులా ఉంది తప్ప ఎన్డీయే కూటమిలా లేదని పలువురు పేర్కొంటున్నారు.


అయితే ఎన్డీయే జాతీయ మ్యానిఫెస్టోలో ఏపీకి సంబంధించిన అంశాలు ఏమీ లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక అంశాలైన విశాఖ స్టీల్ ప్లాంట్, పోలవరం పూర్తి చేయడం, విభజన హామీలు, ప్రత్యేక హోదా ఇలాంటివి ఏమీ లేవని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దేశంతో పాటు రాష్ట్రంలో అధికారం కోసం ఎన్నికలు జరుగుతున్న సమయంలో దేశంతో పాటు రాష్ట్రానికి ఏం చేస్తాం అనే విషయంపై బీజేపీ నాయకులు స్పష్టత ఇవ్వాలి. కానీ వారు ఇవేమీ ప్రకటించకుండా చేతులు దులుపుకున్నారు.  పోటీ మాత్రం ఉమ్మడిగా చేస్తున్నారు. మ్యానిఫెస్టోలో మాత్రం భాగస్వాములు కారు.

మరింత సమాచారం తెలుసుకోండి: