కరోనా కష్టకాలం టీడీపీకి నష్టకాలంగా మారింది. మహానాడు కార్యక్రమం కూడా జూమ్ లోనే జరుపుకోవాల్సి వచ్చింది. దీంతో నాయకులకు, కార్యకర్తలకు గ్యాప్ వచ్చింది. అందులోనూ అధినేత, ఆయన తనయుడు రాష్ట్రంలో కూడా లేరనే అపవాదులు ఎదుర్కోవాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ఉంటూ, ఏపీ గురించి ఏం ఆలోచిస్తారంటూ చంద్రబాబుని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ దశలో చంద్రబాబు మాత్రం కేవలం జూమ్ మీటింగ్ లనే నమ్ముకున్నారు.
ఓ దశలో టీడీపీకి సోషల్ మీడియా బాగా కలిసొచ్చిందని అనుకున్నా.. అదే ఆ పార్టీకి ప్రతిబంధకంగా మారిందనే అనుమానాలున్నాయి. జూమ్ మీటింగ్ లతో కార్యకర్తల్లో ఉత్సాహం కనుమరుగైంది. మాట్లాడే నాయకుల సంఖ్య పెరిగింది కానీ, క్షేత్ర స్థాయిలో పనిచేసే నాయకులు తగ్గిపోయారు. సీనియర్లంతా సైలెంట్ అయిపోయారు. వారంతా లోకేష్ నాయకత్వంపై అనుమానంతో ఉన్నారు. కొంతలో కొంత మేలైన విషయం ఏంటంటే.. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీకి గౌరవ ప్రదమైన ఓట్లు రావడం. అయితే స్థానిక ఎన్నికల్లో మాత్రం పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడం నాయకుల్ని కలవరపెట్టే అంశం.
ఇకనైనా కార్యక్షేత్రంలో దిగుతారా..?
చంద్రబాబు ఇకనైనా జూమ్ వదిలి కార్యక్షేత్రంలో దిగుతారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికయితే ఎక్కడా ఉప ఎన్నికలు లేవు. మరి ఈ టైమ్ లో చంద్రబాబు బయటకొస్తే లాభం ఏంటి..? వస్తే కేవలం ఆందోళన కార్యక్రమాలకోసం రోడ్లపైకి రావాలి. అలా బయటకు రావాలన్నా కొవిడ్ నిబంధనలు అడ్డు వస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. అయితే ఎక్కువకాలం సోషల్ మీడియాని నమ్ముకోవడం మాత్రం సరికాదని పార్టీ వర్గాలంటున్నాయి. ఇకనైనా క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగితేనే ఫలితాలు బాగుంటాయని నాయకులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి