కొన్నిరోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ యాత్ర చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన.. ఈసారి చాలా రోజులు ఢిల్లీలోనే తిష్ట వేశారు. అనేక మంది మంత్రులను కలిశారు. మోదీ, అమిత్‌షాలను కూడా కలిశారు. కొందరు మంత్రులను రెండు రెండు సార్లు కలిశారు. మొత్తానికి కేసీఆర్ సుదీర్ఘ పర్యటన అనేక ఊహాగానాలకు తెరలేపింది. అయితే టీఆర్ఎస్ ఎప్పటి లాగానే రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసమే కేసీఆర్ ఎక్కువ కాలం ఢిల్లీలో ఉన్నారని చెప్పుకొచ్చింది.


అయితే కేసీఆర్ లాంగ్ ఢిల్లీ టూర్‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కేసీఆర్‌కు మోడీకీ మైత్రి కుదిరిందన్న వాదన వినిపిస్తోంది. కేసీఆర్ కూడా మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఏమో.. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు అన్నారు. అంతే కాదు. ఈ బీజేపీ ప్రభుత్వమే మమ్మల్ని కనికరించొచ్చు అని కూడా అన్నారు. కేసీఆర్ సాక్షాత్తూ అసెంబ్లీలో ఏదో నోరు జారే బాపతు కానే కాదు.. అయితే.. దీని వెనుక అసలు కథ ఇదీ అని ఓ పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది.


ఆ కథనంలో వాస్తవం ఎంత ఉన్నా.. విషయాలు మాత్రం ఆసక్తి కరంగా ఉన్నాయి. ఆ కథనం సారాశం ఏంటంటే.. కేసీయార్ ఉపరాష్ట్రపతి అవుతాడట.. కేటీయార్‌ను తెలంగాణ సీఎంను చేసేస్తారట.. మోడీ టీఆర్‌ఎస్‌కు మూడు కేంద్ర మంత్రి పదవుల్ని ఇస్తారట. అందులో ఒకటి హరీష్‌రావు తప్పనిసరిగా ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. అంతే కాదు.. తెలంగాణలో వాయిస్ రైజ్ చేస్తున్న రేవంత్‌ రెడ్డిని అరెస్టు చేసి జైల్లో వేసేస్తారట.. ఈ మేరకు మోడీ, కేసీఆర్ మధ్య ఒప్పందం కుదిరిందని ఆ కథనం చెబుతోంది.


వినడానికి ఈ కథనం ఆసక్తికరంగానే ఉంది. ఎలాగూ వెంకయ్యనాయుడి సమయం పూర్తి కావస్తోంది. అయితే హరీశ్ రావుకు కేంద్ర మంత్రి పదవితో ఢిల్లీకి పంపేస్తారని రాయడం ఆసక్తికరంగా ఉంది. అలాగే రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టే అంశం కూడా. అయినా ఇదో పొలిటికల్ మసాలా స్టోరీ.. ఇందులో వాస్తవాలతో పని లేదు.. ఊహాగానాలే ప్రధానం.. మొత్తానికి వాస్తవం ఎంతున్నా.. ఈ స్టోరీ మాత్రం పొలిటికల్ సర్కిళ్లో బాగా సర్క్యులేట్ అవుతోంది. సరే.. ఈ కథనం స్థాయిలో ఒప్పందం కుదిరిందో లేదో కానీ.. ఢిల్లీలో ఏదో జరిగిందన్న వాదన మాత్రం చాలా మంది అనుమానపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: