రాహుల్ గాంధీ.. పాపం ఘనమైన వారసత్వంగా ఉన్నా.. ఇంకా నాయకుడిగా నిరూపించుకోలేకపోతున్నాడు. ఇంకా తల్లి చాటు బిడ్డడుగానే గుర్తింపు పొందాల్సి వస్తోంది. తనకంటూ సొంత ఇమేజ్‌ను సృష్టించుకోలేకపోవడం ఓ పెద్ద లోటుగానే చెప్పాలి. అదే సమయంలో ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీ మాత్రం.. తన కంటూ సొంత ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారు. అన్నకు అడ్డురాకూడదనో.. పెళ్లి, సంసార బాధ్యతల వల్లో ఆమె పూర్తిగా రాజకీయాలపై దృష్టి పెట్టడం లేదు.


కానీ.. ప్రియాంక గాంధీ మాత్రం నానమ్మ ఇందిరాగాంధీని గుర్తుకు తెచ్చేలా ఉంటూ.. ఛార్మింగ్‌గా కనిపిస్తారు. అయితే ఇప్పుడు ఇదే రాహుల్‌ గాంధీకి భయం కలిగిస్తోందట. తన చెల్లెలు, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శక్తి సామర్థ్యాలను చూసి రాహుల్‌ గాంధీ భయపడిపోతున్నాడట. అందుకే ఆమెను 2017 ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున సీఎం అభ్యర్థిగా ప్రియాంకను ప్రకటించలేదట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్.


తాజాగా ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడిన ప్రశాంత్‌ కిషోర్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక అచ్చం తన నానమ్మ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీలా ఉంటారని ప్రశాంత్‌ కిషోర్ కూడా అభిప్రాయపడ్డారు. అంతే కాదు.. ఆమెలో బలమైన నాయకత్వ లక్షణాలున్నాయని ప్రశాంత్ కిషోర్ ప్రశంసించారు. రాహుల్‌ను తొలిసారి పట్నాలో కలిశాననన్న ప్రశాంత్ కిషోర్.. అప్పుడే తనను కాంగ్రెస్‌ కోసం పనిచేయమని అడిగినట్లు గుర్తు చేసుకున్నారు.


అయితే కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసేందుకు అంగీకరించిన ప్రశాంత్ కిషోర్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటన్నది అంతుబట్టడం లేదు. అయితే ఇదే అభిప్రాయం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ తాను ఎదగడు.. ఎదిగే ప్రియాంకను ప్రోత్సహించడు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఇప్పుడు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ పెట్టిన ఈ చిచ్చు ఏ పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: