ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మొదటిసారిగా స్పందించారు. ఈ మేరకు ఆమె ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో వైసీపీ నేతలు తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు సభలో ఆవేదన వ్యక్తం చేస్తూ, తాను సభలో తిరిగి సీఎం అయ్యే వరకు కాలు పెట్టనంటూ శపదం  చేశారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో టిడిపి నేతలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు మరియు నందమూరి కుటుంబ సభ్యులు సైతం స్పందించారు. వైసిపి నేతల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కన్నీరు పెట్టడం పైన  పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ పరిణామాలపైన తాజాగా  ఏపీ ప్రజలకు నారా భువనేశ్వరి బహిరంగ లేఖ రాయడం సంచలనం రేపుతోంది.

 ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజ్మెంట్ ట్రస్ట్ హోదాలను భువనేశ్వరి లేఖ రాస్తూ అందులో అసెంబ్లీలో తన పైన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. తనకు జరిగిన అవమానాన్ని మీ తల్లికి, మీ తోబుట్టువుకు, కూతురుకు జరిగినట్లుగా భావించి అండగా నిలబడడం తన జీవితంలో మర్చిపోలేనిదని పేర్కొన్నారు. చిన్నతనం నుంచి అమ్మగారు,నాన్నగారు విలువలతో తమను పెంచారని, నేటికీ వాటిని పాటిస్తున్నామని చెప్పారు. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని సూచించారు. కష్టాల్లో, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని సూచించారు. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించ కూడదని హితవు పలికారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా చూడాలని ఆశిస్తున్నట్లు భువనేశ్వరి తన లేఖలో స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ అంశంపైన ఇంకా రాజకీయ రగడ కొనసాగుతోంది. తన సతీమణిని దూషించారంటూ చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లోనూ ప్రస్తావించారు. వైసీపీ నేతలు మాత్రం తాము అసలు సభలో, బయట ఎక్కడ భువనేశ్వరి పేరు ప్రస్తావించలేదని చెబుతున్నారు. ఇక ఇప్పుడు భువనేశ్వరి బహిరంగ లేఖ  లో ఎక్కడా పార్టీలు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: