ఒమిక్రాన్ అంటే.. మొదట్లో ఉన్న భయం ఇప్పుడు చాలా వరకూ పోయింది. మొదట్లో ఒమిక్రాన్ అంటే అదేదో డెల్టాకు తాత అన్నట్టుగా ఉండేది. ఒక్క వ్యాపించడం అనే విషయంలో తప్ప ఒమిక్రాన్‌ ఏ విషయంలోనూ డెల్టా వేరియంట్ కంటే డేంజర్ కాదు.. ఈ విషయం ఇప్పటికే రుజువైపోయింది. అందుకే దేశంలో లక్షల సంఖ్యలో కొత్త కేసులు వస్తున్నా.. సెకండ్‌ వేవ్ రేంజ్‌లో జనంలో భయం కనిపించడం లేదు.


ఒమిక్రాన్ కేసులు అనేక రాష్ట్రాల్లో వేల సంఖ్యలో వస్తున్నాయి. ఒమిక్రాన్ రాకతో ఇండియాలో మూడో వేవ్‌ వచ్చేసిందని ఇప్పుటికే నిపుణులు కూడా చెప్పేశారు. అయితే.. దీని ప్రభావం చాలా తగ్గడం.. చాలా మందిలో అసలు లక్షణాలు లేకపోవడం.. ఉన్న కొద్దిమందిలోనూ స్వల్పంగానే లక్షణాలు ఉండటం వల్ల.. ఒమిక్రాన్ అంటే జనంలో భయంపోయింది. జస్ట్ ఇది కూడా ఓ జలుబులాంటిదే అంతకు మించి ఏమీ కాదు అని ఇప్పటికే అనేక మంది వైద్యులు కూడా చెప్పేశారు.


అయితే.. ఒమిక్రాన్‌ను మరీ అంత తేలిగ్గా తీసిపారేయలేమని కేంద్రం చెబుతోంది. ఒమిక్రాన్‌ విజృంభణ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసింది. థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొవిడ్‌ బాధితుల ఆస్పత్రి చేరికలు కూడా క్రమంగా పెరుగుతున్నాయట. ఇవి ప్రస్తుతం  5 నుంచి 10శాతం వరకూ ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్‌ విజృంభణ బాగానే ఉంది. అందువల్ల ఈ ఆస్పత్రి చేరికలు ఇంకా పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరిస్తోంది.


అందుకే.. ఒమిక్రాన్‌ను లైట్‌ గా తీసుకోకుండా తగిన జాగ్రత్తల్లో ఉండాలని రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించింది. అవసరమైన ఆస్పత్రి పడకలు, వైద్య సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో కొవిడ్‌ రోగులు 20 నుంచి 30శాతం వరకూ ఆస్పత్రుల్లో చేరారు. ఈ థర్డ్ వేవ్‌లో ప్రస్తుతం ఆ సంఖ్య 10 శాతం వరకూ ఉంటోంది. అందుకే ఎందుకైనా మంచిదని కేంద్రం హెచ్చరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: