ఏపీలో రాజకీయం రోజురోజుకీ రసవత్తరంగా సాగుతోంది. ఎన్నికల రిజల్ట్స్ కి ఇంకా 12 రోజులు ఉన్నప్పటికీ పొలిటికల్ హీట్ ఇక్కడ తగ్గడం లేదనే చెప్పుకోవాలి. ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరుగుతున్న సమయంలో మాచర్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటు గ్రామంలో ఎటువంటి వీరంగం సృష్టించాడో అందరికీ తెలిసిందే. అత్యంత కర్కశంగా ఆయన పోలింగ్ బూత్ లోకి అడుగుపెట్టి మరీ ఈవీఎంను ధ్వంసం చేసిన సంగతి అందరికీ తెలుసు. తన అనుచరులతో కోపంగా పోలింగ్ కేంద్రంలోకి అడుగు పెట్టిన పిన్నెల్లి నేరుగా ఈవీఎం మిషన్ వద్దకు వెళ్లి దానిని నేలకేసి చాలా కోపంగా విసిరి కొట్టారు. కాగా ఈ దృశ్యాలు సమీప సీసీ ఫుటేజ్ లో లభ్యమవ్వగా ఈ బండారం కాస్త బయట పడింది. అదిగో అప్పటినుండి మొదలైంది అసలు రచ్చ.

ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ పరస్పరం ఒకరిపై ఒకరు మాటలు తూటాలు విసురుకుంటున్న పరిస్థితి. కాగా తాజాగా వైఎస్సార్‌సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి "టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డిది ఓ నీచ సంస్కృతి. ఫ్యాక్షనిజమే అతని జీవితం" అని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో జరిగిన గొడవలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను ఎప్పటికీ సిద్ధంగా ఉన్నానని, ఆయన మంగళవారం హైద­రా­బాద్‌లో విలేకరుల­తో మాట్లా­డారు. ఈ తరుణంలో ఆయన నేను పోలీసులకి భయపడి ఎక్కడికీ పారిపోలేదని, ఏడు మర్డర్‌ కేసుల్లో ఏ–1గా ఉన్న బ్రహ్మారెడ్డి నాపై చేస్తున్న విమర్శలను ప్రజలు నమ్మడం లేదని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాపై పోటీ చేసి ఓడిపోయిన బ్రహ్మారెడ్డి గుంటూరుకు పారిపో­యాడు. ఆ తర్వాత మా నియోజక­వర్గం వైపు కన్నెత్తి చూడలేదు. అలాంటి బ్రహ్మారెడ్డి నాకోసం ఇపుడు ఇలా మాట్లాడడం చాలా చోద్యంగా ఉందని అన్నారు. ఎన్నికల రోజు జరిగిన సంఘటనలకు తరువాతి రోజుల్లో గొడవలు జరిగితే ప్రజలు ఇబ్బంది పడతారని పోలీ­సుల సూచనల మేరకు హైదరాబాద్‌కు వచ్చాను అంటూ చెప్పుకొచ్చారు. అదేవిధంగా మర్డర్లు చేసి పారిపోయిన చరిత్ర తనకి లేదని, ఎన్నడూ తాను వూరి విడిచి పారిపోయిన దాఖలాలు లేవని చెప్పుకొచ్చారు. బ్రహ్మారెడ్డిలా నీచ రాజకీయాలు చేసి పారిపోయే చరిత్ర తనది కాదని, ఎప్పుడూ ప్రజలకు వెన్నంటే ఉంటాను అని ఈ సందర్భంగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: